Share News

బ్యాంకు దోపిడీకి ‘వెనుక’ ప్లాన్‌

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:08 AM

బ్యాంకు దోపిడీకి ‘పక్క’ ప్లాన్‌ వేశారు. ఈ భవనానికి.. వెనక గోడౌన్‌కు మధ్యలో ఉన్నది ఒకటే గోడ. దీంతో గోడౌన్‌లోకి చొరబడిన దుండగులు.. గోడకు కన్నం వేసి వేసి బ్యాంకులోకి దూరారు. చోరీకి విఫలయత్నం చేసి వెనుదిరిగారు.

బ్యాంకు దోపిడీకి ‘వెనుక’ ప్లాన్‌
గోడౌన్‌లో నుంచి బ్యాంకు గోడకు వేసిన కన్నం

గోడౌన్‌లో నుంచి కన్నం వేసిన దుండగులు

నాగలాపురం యూబీఐలో చోరీకి విఫలయత్నం

బ్యాంకు దోపిడీకి ‘పక్క’ ప్లాన్‌ వేశారు. ఈ భవనానికి.. వెనక గోడౌన్‌కు మధ్యలో ఉన్నది ఒకటే గోడ. దీంతో గోడౌన్‌లోకి చొరబడిన దుండగులు.. గోడకు కన్నం వేసి వేసి బ్యాంకులోకి దూరారు. చోరీకి విఫలయత్నం చేసి వెనుదిరిగారు.

నాగలాపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నాగలాపురంలోని యూనియన్‌ బ్యాంకుకు మంగళవారం రాత్రి కన్నం వేశారు. చోరీకి యత్నించి విఫలమయ్యారు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యూనియన్‌ బ్యాంకుకు వెనుక వైపు సిమెంట్‌ గోడౌన్‌ ఉంది. ఇద్దరు దుండగులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సిమెంట్‌ గోడౌన్‌ షట్టర్‌ను ధ్వంసంచేసి లోనికి ప్రవేశించారు. గోడౌన్‌ లోపల నుంచి బ్యాంకు భవనం గోడకు మనిషి దూరే కన్నం వేశారు. లోపలకు వెళ్లిన వీరు ముందుగా సీసీ కెమెరాలను, అలారం సెట్‌ను తొలగించారు. సిమెంట్‌ గోడౌన్‌లో విద్యుత్‌ సరఫరా లేకపోయే సరికి బ్యాటరీ కటింగ్‌ మిషన్‌ ద్వారా కన్నం వేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లోపల లాకరును తెరిచేందుకు రాత్రంతా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడం.. తెల్లవారుతుండడంతో దుండగులు వెనక్కి వచ్చారు. బ్యాంకులోపల సీసీ టీవీ, డీవీఆర్‌ బాక్సులు, హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్లారు. బుఽధవారం ఉదయం విధులకు వచ్చిన బ్యాంకు సిబ్బంది దీనిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌, సత్యవేడు ఎస్‌ఐ రామస్వామి, టీఎ్‌సఐ ప్రసాద్‌ పరిసరాలను పరిశీలించారు. విచారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. ఘటన జరిగిన సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితుల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు.

గతంలోనూ ఇదే తరహా చోరీలు

గతంలోనూ ఓ దొంగల ముఠా నాగలాపురంలో ఇదే తరహాలో చోరీకి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. బట్టల దుకాణం, నగల దుకాణం, ఏటీఎం కేంద్రాల్లో చోరీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు.

Updated Date - Oct 16 , 2025 | 02:08 AM