Share News

ఏర్పాట్లు భేష్‌..!

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:15 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఏర్పాట్లు భేష్‌..!
శ్రీవారి ఆలయం ముందు విష్వక్సేనుడి ఊరేగింపు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు విశేష అలంకరణలో గదతో తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి వెలుపలకు వచ్చారు. మహాద్వారం వద్ద హారతి అందుకుని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక, ఆలయంలోని యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని ముందుగానే పేడతో అలంకరించారు. సేనాధిపతి ఊరేగింపు తర్వాత ఆ ప్రదేశంలో బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానించారు. అనంతరం భూమాతను ప్రార్ధిస్తూ అందులో ముందుగానే సేకరించిన మట్టిని కుండలలో వేసి శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను చల్లి నీరు పోశారు. ఆ పాలికలను నూతన వస్త్రంతో అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. ఇలా శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తూ మొలకలు వచ్చేలా చర్యలు తీసుకుంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్ట ఉద్దేశం. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, దివాకర్‌రెడ్డి, నరేష్‌, శాంతారామ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:15 AM