దూసుకొస్తున్న దిత్వా
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:13 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీరం వైపు దూసుకొస్తోందని, ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- తుపాను ప్రభావంతో నేడు, రేపు జిల్లాలో భారీ వర్షాలు
- ఇస్రో ఉపగ్రహాల ద్వారా సమాచారం
- అప్రమత్తమైన అధికారులు
సూళ్లూరుపేట, నవంబరు 29 (ఆంరఽధజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీరం వైపు దూసుకొస్తోందని, ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంకను ఆనుకుని కొనసాగుతున్న తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 4 గంటలుగా 6 కి.మీ వేగంతో కదులుతోంది. తుపాను ప్రభావంతో జిల్లాలో శనివారం ఉదయం నుంచి చలిగాలులతో కూడిన జల్లులు కురిశాయి. పెళ్లకూరులో 32.2మి.మీ, తొట్టంబేడులో 30, డీవీసత్రంలో 26.6, సూళ్లూరుపేటలో 17 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశముంది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. నదులు, వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం వరకు మత్స్యకారులు పులికాట్ సరస్సు, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముంది. ఇస్రో సహకారంతో తుఫాన్ ప్రభావం, దాని కదలికలు, సంబంధిత ప్రాంతాల్లో వాతావరణం గురించిన సమాచారాన్ని అధికారులు తెలుసుకుంటూ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెలవుల్లో ఉన్న వారు రద్దు చేసుకుని విధులకు హాజరుకావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మండల, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని కోరారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్ రద్దు చేయడమేగాక విద్యా సంస్థలకు సెలవు ఇవ్వనున్నట్లు తెలిసింది.
తూపిలిపాళెం బీచ్‌లోకి అనుమతి లేదు
వాకాడు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తూపిలిపాళెం సముద్రతీరంలో పర్యాటకులకు అనుమతి లేదని మెరైన్ సీఐ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని బీచ్‌లలో పర్యాటకులను అనుమతించడంలేదన్నారు.
అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తుపాను ప్రకటన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. తిరుపతిలో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సెలవులు రద్దు చేయాలన్నారు.