Share News

అంధ విద్యార్థి సాహసం

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:03 AM

పిల్లల్లో డ్రగ్స్‌ ,మొబైల్‌ వినియోగం నానాటికి పెరిగిపోతుండడంపై ఆందోళన చెందిన ఓ 11 ఏళ్ళ అంధబాలుడు వాటిపై అవగాహన కల్పించడానికి టాస్క్‌ రోడ్డు స్కేటింగ్‌ మారథాన్‌కు పూనుకున్నాడు

అంధ  విద్యార్థి సాహసం
బంగారుపాళ్యం , చిత్తూరు శివారు ప్రాంతమైన వరిగపల్లె వద్ద హర్షవర్థన్‌ స్కేటింగ్‌

చిత్తూరు అర్బన్‌/బంగారుపాళ్యం,డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో డ్రగ్స్‌ ,మొబైల్‌ వినియోగం నానాటికి పెరిగిపోతుండడంపై ఆందోళన చెందిన ఓ 11 ఏళ్ళ అంధబాలుడు వాటిపై అవగాహన కల్పించడానికి టాస్క్‌ రోడ్డు స్కేటింగ్‌ మారథాన్‌కు పూనుకున్నాడు. కర్ణాటక సరిహద్దులోని నంగిలి నుంచి సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన స్కేటింగ్‌ యాత్ర పలమనేరు,బంగారుపాళ్యం, చిత్తూరు,తిరుపతి, శ్రీకాళహస్తి మీదుగా పుత్తూరుకు రాత్రికి చేరుకుంది.తిరుపతిలో నివసిస్తోన్న ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన మునిబాబు,రాజకుమారి దంపతులు కుమారుడు మురారి హర్షవర్థన్‌. పుట్టుకతోనే అంధుడైన హర్షవర్థన్‌ ప్రస్తుతం తిరుచానూరులోని నవజీవన్‌ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.గత సంవత్సరం శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వేసవి శిక్షణా తరగతులకు హాజరైన హర్షవర్థన్‌ ప్రతిభను గుర్తించిన కోచ్‌లు ప్రతా్‌ప,ప్రేమనాథ్‌ స్కేటింగ్‌ నేర్పించారు.పుత్తూరులోని టాలెంట్‌ స్కేటింగ్‌ అకాడమీలో ఆరునెలలు శిక్షణ తీసుకున్నాడు.స్కేటింగ్‌ వరల్డ్‌ రికార్డు సాధించాలని నిర్ణయించుకున్న హర్షవర్థన్‌ ఆరు నెలలుగా రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనాలతో పాటు ఎత్తుపల్లాలను దాటుకుని ఎలా వె ళ్లాలో శిక్షణ తీసుకున్నాడు. పిల్లల్లో డ్రగ్స్‌ , మొబైల్‌ వ్యసనాలపై అవగాహన కల్పించడమే తన మారథాన్‌ లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు.శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా ఆయన తిరుపతి,చిత్తూరు జిల్లాల క్రీడాసాధికార సంస్థ అధికారులకు సహకారం అందించాలని సూచించారు.వ్యక్తిగతంగా కూడా ఆర్థికసాయం అందించారు. దీంతో హర్షవర్థన్‌ 230 కిలో మీటర్ల దూరం టాస్క్‌ రోడ్డు స్కేటింగ్‌ మారథాన్‌కు సోమవారం పూనుకున్నాడు. హర్షవర్థన్‌ స్కేటింగ్‌ చేస్తూ వెళ్లే మార్గంలో ముందు, వెనకాల పోలీసులతో పాటు అంబులెన్స్‌ కూడా వెళుతోంది.సోమవారం అర్ధరాత్రి దాటాక గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఉందని కోచ్‌ ప్రతాప్‌ తెలిపారు. ఈ సాహసాన్ని వజ్ర వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థల ప్రతినిధులు రికార్డు చేశారు.

Updated Date - Dec 09 , 2025 | 12:03 AM