ఆ ముగ్గురూ ఆస్పత్రికి
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:18 AM
అవును.. వీళ్లు బతికే ఉన్నారు’ అంటూ ప్రాణమున్న శవాల్లా పడున్న వారి గురించి ‘ఆంధ్రజ్యోతి’ మానవీయ కోణంలో స్పందించింది. మొన్న ఆరుగురు.. మంగళవారానికి ఐదుగురయ్యారు. మంగళవారం వృద్ధుడి మృతితో నలుగురు మిగిలారు. ఎవరికీ పట్టని ఆ నలుగురి దైన్యస్థితి, వారికి అమ్మలా సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త సుజాత గురించి ప్రస్తావించింది.
మరో వృద్ధుడి మృతి
‘అవును.. వీళ్లు బతికే ఉన్నారు’ అంటూ ప్రాణమున్న శవాల్లా పడున్న వారి గురించి ‘ఆంధ్రజ్యోతి’ మానవీయ కోణంలో స్పందించింది. మొన్న ఆరుగురు.. మంగళవారానికి ఐదుగురయ్యారు. మంగళవారం వృద్ధుడి మృతితో నలుగురు మిగిలారు. ఎవరికీ పట్టని ఆ నలుగురి దైన్యస్థితి, వారికి అమ్మలా సేవలు అందిస్తున్న సామాజిక కార్యకర్త సుజాత గురించి ప్రస్తావించింది. దీనికి కలెక్టర్ వెంకటేశ్వర్ నుంచి మానవీయ కోణంలో స్పందన లభించింది. తిరుపతి రుయాస్పత్రి సమీపంలోని ఇస్కాన్‌కు వెళ్లే రోడ్డు పక్కన బస్టా్‌పలో పడున్న ఆ నలుగురికీ మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌ను బుధవారం కలెక్టర్ ఆదేశించారు. వైద్య సిబ్బంది అక్కడకు చేరుకునే సరికే మరో వృద్ధుడు మరణించాడు. మిగిలిన ముగ్గురిని రుయాస్పత్రికి తరలించి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటే ముందే అక్కడకు చేరుకున్న సామాజిక కార్యకర్త సుజాత మృతి చెందిన మరో వృద్ధుడికి కూడా సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు. చికిత్స పొందుతున్న ముగ్గురికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు శ్రీజనతా సేవా మిత్ర హెల్పింగ్‌హ్యాండ్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. వీరికి ముగ్గురు అటెండర్లను రుయాస్పత్రిలో ఉంచారు. అవసరమైన మందులను అందిస్తామని తెలిపారు. ఆ ముగ్గురి ఆరోగ్యం మెరుగై.. వారు కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
- తిరుపతి(వైద్యం), ఆంధ్రజ్యోతి