రేపటినుంచి అమల్లోకి టెన్త్ వంద రోజుల ప్రణాళిక
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:48 AM
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
అధికారులకు హైస్కూళ్ల బాధ్యత
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలో జిల్లా అధికారులకు పదవ తరగతి విద్యార్థులు ఉన్న హైస్కూళ్ల బాధ్యత అప్పగించనుంది. ఈనెల 6 నుంచి వంద రోజుల అకడమిక్ ప్రణాళికను అమలు చేయనున్నారు. విద్యార్థుల ప్రగతిని మానిటరింగ్ చేయనున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేస్తారనేది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదవ తరగతి సిలబస్ ఈనెల 5 నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ఆదేశించారు. 6వ తేదీ నుంచి వంద రోజుల ప్రణాళిక ప్రారంభం కానుంది. యూడైస్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు బదులుగా ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు ఇస్తే సంబంధిత టీచర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు.