‘స్థానిక’ సమరానికి తాత్కాలిక షెడ్యూల్
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:15 AM
గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ పాలకుల పదవీకాలం 2026 మార్చి, ఏప్రిల్‌లో ముగియనుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేందుకు మూడు నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం స్థానిక సమరానికి సిద్ధమైంది.
షెడ్యూల్ ఇలా..
తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 15వ తేదీలోపు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి. అక్టోబరు 16 నుంచి నవంబరు 15వ తేదీలోగా వార్డులవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధంచేసి ప్రచురించాలి. నవంబరు ఒకటి నుంచి 15వ తేదీలోపు ఎన్నికల అధికారుల నియామకం, 16-30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, బ్యాలెట్ పెట్టెల మరమ్మతులు చేయించాలి. ఒకవేళ ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తే, కొత్తవి కొనుగోలు చేసి వాటి మొదటిస్థాయి తనిఖీలు చేయాలి. డిసెంబరు 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. చివరివారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన జారీచేసి వెనువెంటనే పోలింగ్, ఫలితాలు ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారుచేసిన తర్వాతే ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేయనుంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న ఔత్సాహికులు అప్పుడే గ్రామాల్లో పావులు కదిపే ప్రయత్నాలు మొదలెట్టారు.