Share News

తెలుగుగంగ ఉద్యోగి డిస్మిస్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:51 AM

తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డిని అధికారులు డిస్మిస్‌ చేశారు.

తెలుగుగంగ ఉద్యోగి డిస్మిస్‌

శ్రీకాళహస్తి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డిని అధికారులు డిస్మిస్‌ చేశారు. వివరాలివి.. 2011లో తెలుగుగంగ నీటి ప్రాజెక్టు కింద భూ నిర్వాసితుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలను మంజూరు చేసింది. కడప జిల్లా బద్వేలు మండలం చౌటపల్లికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తన భూమి మునిగినట్లు ఫోర్జరీ సంతకాలతో అవార్డు సర్టిఫికెట్‌ సృష్టించాడు. 2011 జనవరి 29న తెలుగుగంగలో టైపిస్టుగా ఉద్యోగం పొందాడు. తరువాత జూనియర్‌ అసిస్టెంట్‌గా తిరుపతిలో పనిచేశాడు. ఆరునెలల క్రితం సీనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీపై శ్రీకాళహస్తికి వచ్చాడు. అయితే 2011లో నియామకం పొందిన పలువురు నకిలీ సర్టిఫికెట్లు పొందుపరచినట్లుగా కొంతకాలం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అధికారులు లోతుగా విచారించి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెలుగుగంగ కార్యాలయాల్లో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. వీరిలో సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. డీఈ విశ్వనాథరెడ్డి ఫిర్యాదు మేరకు తెలుగుగంగ మాజీ ఉద్యోగిపై చీటింగ్‌ కేసును నమోదు చేశారు.

Updated Date - Dec 14 , 2025 | 01:51 AM