కన్నీళ్లొస్తున్నాయ్..!
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:15 AM
ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటా నెల్లూరు జిల్లాలో గూడూరు విలీనంపై పోరాడతానన్న ఎమ్మెల్యే పాశిం
కోట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎన్నికల ముందు నుంచీ ప్రజలకు మాటిచ్చా. దీనికోసం పోరాడుతూనే ఉన్నా. ప్రజల కోరిక నెరవేరకపోవడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనందుకు కన్నీళ్లొస్తున్నాయ్. రాజకీయాలు శాశ్వతం కాదు. అవసరమైతే వదులుకునే పరిస్థితిలో ఉన్నా. టీడీపీ అధినాయకత్వాన్ని ఒప్పిస్తా. ప్రజలకు ఇచ్చినమాట నిలబెట్టుకునే వరకు పోరాడుతూనే ఉంటా’నంటూ గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ ఆవేదన చెందారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ‘గూడూరును నెల్లూరుజిల్లాలో కలపాలని రెండు పర్యాయాలు అసెంబ్లీలో ప్రస్తావించా. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కూడా ఎన్నికలకు ముందు ఈ హామీ ఇచ్చారు. ఈ విషయంలో పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చి గూడూరు నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకునే సమయంలో ఏం జరిగిందో కానీ, చివరిక్షణంలో ఆగింది. కన్నీళ్లు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నా. గూడూరు నియోజకవర్గ ప్రజలకు జరిగిన అన్యాయంపై 20 మంది మంత్రులకు ఫ్యాక్స్ ద్వారా వివరించా. అందరూ సానుకూలంగా స్పందించారు. ఇక్కడి వాస్తవ పరిస్థితులను సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు స్వయంగా వివరిస్తా. గూడూరును నెల్లూరులో కలిపేందుకు కృషిచేస్తా. దీనిని రాజకీయం చేయొద్దు. గూడూరును తిరుపతిలో కలిపిన పాపం ఏవరిదో ప్రజలకు తెలుసు. నాకు రాజకీయ భవిష్యత్తు ఉన్నా.. లేకున్నా గూడూరు కోసం పోరాడుతూనే ఉంటా’ అని ఎమ్మెల్యే చెప్పారు.