ఏకలవ్య గురుకులంలో ఉపాధ్యాయుల దాష్టీకం
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:35 AM
అల్లరి చేస్తున్నారని విద్యార్థులను చితకబాదిన వైనం తల్లిదండ్రుల ఆందోళన, పోలీసుల విచారణ వైస్ ప్రిన్సిపాల్, మరో టీచర్ సస్పెన్షన్
ఓజిలి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం వాకాటివారికండ్రిగ వద్ద ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 20 విద్యార్థులను ఇద్దరు ఉపాధ్యాయులు విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం మేరకు.. శనివారం సాయంత్రం స్టడీ అవర్‌లో చదువుకోకుండా అల్లరి చేస్తున్నారంటూ వైస్ ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్ 20మంది ఏడో తరగతి విద్యార్థులను చితకబాదారు. మంచినీటి పైప్‌తో కొట్టడంతో పలుచోట్ల విద్యార్థుల చర్మం కమిలిపోయింది. ఆదివారం పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు పిల్లల చర్మం కమిలిపోయి, వాతలు కనిపించడంతో ఆరా తీశారు. వైస్ ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్ తీవ్రంగా కొట్టారని, అతనికి హిందీ టీచర్ హరికృష్ణ సహకరించారని పిల్లలు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఎవరినీ పాఠశాల లోపలకు వెళ్లనీయకుండా ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థుల తలిదండ్రులు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్ గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు, విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్, హిందీ టీచర్ హరికృష్ణను ఉన్నతాధికారులు ఆదివారం సస్పెండ్ చేశారు.