సాంకేతిక సమస్యలతో టీచర్లు సతమతం
ABN , Publish Date - May 25 , 2025 | 01:16 AM
విద్యాశాఖలోని టీచర్ల బదిలీల్లో చోటు చేసుకున్న సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. పనిచేసిన కాలానికి (సర్వీసు) సీలింగ్ ఎత్తివేస్తే బదిలీల్లో తమకు ప్రయోజనం ఉంటుందని శాంతిపురం మండలానికి చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్లు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చారు.
సర్వీసు పాయింట్లు కోల్పోవడంతో బదిలీల్లో నష్టం జరుగుతుందని ఆవేదన
చిత్తూరు సెంట్రల్, మే 24 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలోని టీచర్ల బదిలీల్లో చోటు చేసుకున్న సాంకేతిక సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. పనిచేసిన కాలానికి (సర్వీసు) సీలింగ్ ఎత్తివేస్తే బదిలీల్లో తమకు ప్రయోజనం ఉంటుందని శాంతిపురం మండలానికి చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్లు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చారు. ఏడాదికి మూడు పాయింట్లు చొప్పున తొమ్మిదేళ్లకు పైబడి మూడో కేటగిరీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసిన తమకు ఎనిమిదేళ్ల సీలింగ్ విధించడంతో అదనపు పాయింట్లు కోల్పోయి, బదిలీల్లో నష్టం వాటిల్లుతుందని శాంతిపురం మండలానికి చెందిన టీచర్లు వెంకటేష్, నవీన్, ప్రహస్తి, లలిత, మహేశ్వరి, చంద్రిక తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల సీలింగ్ పెట్టడంతో జిల్లాలో 700 మంది, రాష్ట్రంలో పదివేల మంది టీచర్లు పాయింట్లు రాకపోవడంతో అనుకూలమైన ప్రాంతాలు వెళ్లలేక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీలింగ్ ఎత్తివేసి తమకు న్యాయం చేయాలని విద్యాశాఖాధికారులకు వినతిపత్రం సమర్పించారు. విడో, ఓల్డ్ స్టేషన్ పాయింట్లు, లీగల్లీ సెపరేటెడ్, 40 ఏళ్ల పైబడిన సింగిల్ ఉమెన్ వంటి వారికి సైతం రావాల్సిన పాయింట్లు విద్యాశాఖ సైట్‌లో చూపించక పోవడంతో బదిలీల్లో తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారులు వివరణ ఇస్తూ.. ప్రస్తుతం బదిలీల అప్లికేషన్లలో పలు అంశాలకు సంబంధించి సాంకేతిక సమస్యల అప్‌డేట్స్ రాష్ట్రస్థాయిలో జరుగుతున్నాయని చెప్పారు. సర్వీసు పాయింట్లలోని లోపాలు, 2021 తర్వాత రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయుల సమస్యలు, రెండు సార్లు రేషనలైజేషన్‌కు గురైన వారికి ఏడు పాయింట్లు కేటాయింపులు చేసే వీలుందని తెలిపారు.