నేటినుంచి ఇంటింటికీ టీడీపీ
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:01 AM
అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నేటి నుంచీ జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది.
సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కుప్పంలో ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
నెల రోజులపాటు జనం బాట పట్టనున్న అధికార పార్టీ నేతలు
చిత్తూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి):అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నేటి నుంచీ జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. బుధవారం నుంచీ అధికార పార్టీ నేతలు నెల రోజులపాటు జనం బాట పట్టనున్నారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం సాయంత్రం శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లెలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సుమారు రెండు గంటల పాటు గ్రామంలో ఉండి, ఇంటింటికీ వెళ్తారు.గడచిన ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేయనున్నారు.గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ విదేశీ పర్యటనలో వున్న దృష్ట్యా ఆయన మినహా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు, నేతలు ఇంటింటికీ వెళ్ళి జనంతో మమేకం కానున్నారు. పాడైన రోడ్లు బాగుపడడం, కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం, పెరిగిన సంక్షేమ పెన్షన్ మొత్తాలు, తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ వంటి పథకాల అమలు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ధైర్యంగా జనంలోకి వెళ్ళగలిగే వాతావరణం నెలకొనివుండడంతో పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది.
ఫ ఏ ఎమ్మెల్యే ఎక్కడ పాల్గొంటారంటే..
ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి వి.కోట మండలం కొంగాటం గ్రామంలో బుధవారం ఉదయం పర్యటించనున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ బుధవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు నగరంలోని ఎం.అగ్రహారం నుంచి ప్రారంభించి, మురకంబట్టు, చవటపల్లె, దొడ్డిపల్లె, కట్టమంచి ప్రాంతాల్లో సాయంత్రం వరకు పర్యటిస్తారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఉదయం 7 గంటలకు బంగారుపాళ్యం మండలంలోని సంక్రాంతిపల్లె నుంచి ప్రారంభించి, ఐరాలలోని వడ్రాంపల్లె, తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లె, పూతలపట్టులోని కమ్మగుట్టపల్లె, యాదమరిలోని తెల్లార్లపల్లెల్లో పర్యటిస్తారు.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విజయపురం మండలం పన్నూరు గ్రామంలో పర్యటించనున్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పులిచెర్ల మండలం కల్లూరులో పాల్గొననున్నారు.
ఫ తొలి ఏడాదిలో చేసిన పనులివీ
ఇప్పటికే జిల్లాలో సామాజిక పెన్షన్లను పెంచి 2.66 లక్షల మందికి నెలకు రూ.122 కోట్లను అందిస్తున్నారు. మహిళలకు ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించి రూ.40.53 కోట్లను ఖర్చు చేశారు. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి జిల్లాలోని 2.60 లక్షల మంది పిల్లలకు రూ.338 కోట్లను అందించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు జిల్లాలో రహదారుల మరమ్మతులు, అభివృద్ధి.. గోకులం షెడ్ల నిర్మాణం.. మామిడి రైతులకు సబ్సిడీ.. సీసీ రోడ్ల నిర్మాణం.. వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. వీటన్నింటి గురించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అవగాహన తెచ్చుకుని.. ఇంటింటికి వెళ్లి వివరించాల్సి ఉంటుంది.