టీడీపీ, సంస్థాగత ఎన్నికలు, సాగదీత,
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:28 AM
తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ఎన్నిక ప్రక్రియ సా...గుతోంది. పార్టీ మహానాడు జరిగి రెండు నెలలు దాటుతున్నా ఇంకా మండల, పట్టణ, నగర కమిటీల ఎన్నిక ముగియలేదు. పలుచోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలాచోట్ల పోటీ తీవ్రంగా ఉంది
పలుచోట్ల కుదరని ఏకాభిప్రాయం
తిరుపతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ఎన్నిక ప్రక్రియ సా...గుతోంది. పార్టీ మహానాడు జరిగి రెండు నెలలు దాటుతున్నా ఇంకా మండల, పట్టణ, నగర కమిటీల ఎన్నిక ముగియలేదు. పలుచోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలాచోట్ల పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహుల పేర్లు అధిష్ఠానానికి చేరాయి. కొన్ని చోట్ల ఒకే పేరు సిఫారసు చేసినా అధికారిక ప్రకటనలు వెలువడడం లేదు. పరిశీలకులు మొదలుకుని ఎమ్మెల్యేల దాకా సంస్థాగత ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవడం లేదని శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి.
తిరుపతి నగర కమిటీ ఎన్నికయ్యేది ఎప్పుడు?
తిరుపతి నియోజకవర్గం పూర్తిగా నగర ప్రాంతం. 50 డివిజన్లలోనూ దాదాపు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక పూర్తయింది. నగర కమిటీ మాత్రం ఇంకా పెండింగులోనే ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ఈ కమిటీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బలిజ, యాదవ, కమ్మ సామాజికవర్గాల నుంచీ పలువురు ఈ పదవి ఆశిస్తున్నారు. మునిశేఖర్ రాయల్, ఆనంద్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇన్‌ఛార్జి నియామకం కూడా ఇక్కడ పెండింగులో ఉండటం గమనార్హం. అధిష్ఠానం ముందు ఇన్‌ఛార్జిని నియమిస్తుందా లేదా నగర కమిటీని ప్రకటిస్తుందా అన్నది అంతుబట్టని పరిస్థితి. నియోజకవర్గ పరిశీలకుడు ఆలపాటి రాజా గత మంగళ, బుధవారాల్లో ఇక్కడే మకాం వేసి డివిజన్, క్లస్టర్ స్థాయి నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి అందజేశారు. మరి ఏ నిర్ణయాన్ని.. ఎప్పుడు తీసుకుంటారో వేచి చూడాలి.
‘పేట’లో పోటాపోటీ.. ఓజిలిలో నేతల బాహాబాహీ
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పదవులకు పోటీ తలెత్తింది. సూళ్ళూరుపేట మండల అధ్యక్ష పదవికి ఏకంగా ఏడుగురు పోటీ పడుతుండగా.. కార్యదర్శి పదవి కోసం ఐదుగురు ఆశపడుతున్నారు. పట్టణ అధ్యక్ష పదవికి ముగ్గురు, కార్యదర్శి పదవికి ఐదుగురు పోటీలో ఉన్నారు. పెళ్లకూరులోనూ అధ్యక్ష పదవికి ఏడుగరు, కార్యదర్శి పదవికి ముగ్గురు.. తడలో ఇద్దరు, ముగ్గురు.. దొరవారిసత్రంలో రెండింటికీ ముగ్గురేసి చొప్పున పోటీ పడుతున్నారు. నాయుడుపేట పట్టణ అధ్యక్ష పదవిని ఇద్దరు, కార్యదర్శి పదవిని నలుగురు కోరుతున్నారు. అక్కడే మండల అధ్యక్ష పదవికి ఇద్దరు, కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఓజిలిలో రెండు పదవులకూ నలుగురేసి చొప్పున ఆశిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధన కోసం ఇటీవల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ, పరిశీలకుడు శివప్రసాద్ సమక్షంలోనే మునుపటి నుంచీ వున్న నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. వ్యవహారం అధిష్ఠానం చెంతకు చేరింది.
వెంకటగిరి పేర్లు అధిష్ఠానానికి
వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలోని మూడు మండలాలకు గానూ వెంకటగిరి మండల అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది. వెంకటగిరి పట్టణ కమిటీకి, డక్కిలి, బాలాయపల్లి మండలాలకు ఒక్కో పేరు మాత్రమే అధిష్టానానికి వెళ్లగా, వెంకటగిరి మండల అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు. రాజీ కుదరకపోవడంతో వారం కిందట రెండు పేర్లూ అధిష్ఠానానికి పంపించారు. ఇంకా నిర్ణయం వెలువడలేదు.
సత్యవేడులో మొదలుకాని ప్రక్రియ
సత్యవేడు నియోజకవర్గంలో జూలై మొదటి వారంలో కూరపాటి శంకర్‌రెడ్డి సమన్వయకర్తగా నియమితులయ్యారు. అందువల్ల ఇక్కడ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించే తీరునుబట్టి పార్టీ కోసం కష్టపడేవారికే గ్రామ, మండల కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. దీంతో ఇక్కడ కమిటీల ఎన్నిక జరగడానికి మరికొంత కాలం పట్టొచ్చు. మండల పార్టీ అధ్యక్ష పదవులకు మాత్రం విపరీతమైన పోటీ ఉంది. సత్యవేడులో నలుగురు.. నాగలాపురంలో ఐదుగురు రేసులో ఉన్నారు. పిచ్చాటూరులో ఒక వర్గం నుంచి ముగ్గురు, మరో వర్గంలో ఇద్దరు, ఇంకో వర్గం నుంచి ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నారు. బీఎన్ కండ్రిగ అధ్యక్ష పదవిని ఏకంగా ఏడుగురు ఆశిస్తుంటే, వరదయ్యపాలెంలో ఆరుగురు, కేవీబీపురంలో ముగ్గురు, నారాయణవనంలో ఇద్దరు పోటీ పడుతున్నారు.
ఆ నాలుగింట ఏకాభిప్రాయాలు
గూడూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో మండల, పట్టణ కమిటీల అధ్యక్ష పదవులకు దాదాపుగా ఏకాభిప్రాయాలు సాధ్యమయ్యాయి. అధ్యక్ష పదవులకు ఒక్కో పేరునే సూచిస్తూ నియోజకవర్గ నాయకత్వాలు అధిష్ఠానానికి పంపించాయి. అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన వెలువడాల్సి వుంది.
జిల్లా, అనుబంధ సంఘాలెప్పుడు?
వాస్తవానికి గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకం పూర్తి చేశాకే రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల ఎన్నిక మహానాడులో జరుగుతుంది. ఈ పర్యాయం సంస్థాగత ఎన్నికలు జరపకుండానే మే నెలలో మహానాడు జరిపారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. మహానాడు ముగిశాక సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ రెండు నెలలు దాటుతున్నా గ్రామ, పట్టణ, నగర, మండల కమిటీలు పూర్తి కాకపోవడం శ్రేణుల్లో అసంతృప్తిని మిగుల్చుతోంది. నామినేటెడ్ పదవులు ఆశించి నిరాశకు లోనైన వారికి కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయని భావిస్తుండగా ఆ ప్రక్రియ కూడా ఆలస్యమవుతుండడంతో నిస్పృహ చెందుతున్నాయి. వీటికే ఇంత ఆలస్యమైతే ఇక జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటయ్యేది ఎప్పుడన్న ప్రశ్న శ్రేణుల నుంచి వినిపిస్తోంది.