సామాన్య కార్యకర్తకు టీడీపీ అందలం
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:51 PM
సామాన్య కార్యకర్తకు టీడీపీ అధిష్ఠానం పెద్దపీట వేసింది. నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డిని ఏకంగా పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించనుంది.
చిత్తూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సామాన్య కార్యకర్తకు టీడీపీ అధిష్ఠానం పెద్దపీట వేసింది. నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డిని ఏకంగా పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించనుంది.ప్రస్తుతం ఆయన చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా, వన్నియకుల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా వున్నారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మిట్టపల్లూరుకు చెందిన షణ్ముగ రెడ్డి గత ఎన్నికల నుంచి క్లస్టర్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు బ్యానర్లు కడితే వైసీపీ శ్రేణులు వాటిని తొలగించాయి. అప్పుడు షణ్ముగరెడ్డి వారిని నిలువరించగా దాడి చేసి గాయపరిచారు. దీన్ని పాదయాత్ర సమయంలో నారా లోకేశ్ గుర్తించి షణ్ముగరెడ్డికి ధైర్యం చెప్పారు. ఈయన పేరుతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు సీఆర్ రాజన్ పేరుతో కలిపి అధిష్ఠానం గతంలో ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా నిర్వహించింది. అప్పుడే ఈ ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఒకట్రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది.
మిగిలిన పదవులు ఇలా
అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇస్తారని పార్టీలో సీనియర్లు ముందు నుంచే అంచనా వేస్తూ వచ్చారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఏకంగా నలుగురు కమ్మ ఎమ్మెల్యేలుండడంతో, అధ్యక్ష పదవి ఆ వర్గానికి రాదని భావించారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి కమ్మ వర్గానికి ఇచ్చే విషయమై పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అధ్యక్ష పదవి ఆశించి భంగపడినవారిలో పాలసముద్రం మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎన్‌పీ జయప్రకాష్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ఒకరికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇస్తారా.. మరొకరిని పరిశీలిస్తారా అనేది త్వరలోనే స్పష్టం కానుంది. ఎందుకంటే తవణంపల్లెకు చెందిన ఓ కమ్మ నేత పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో కీలక పదవి అయిన తెలుగు యువత అధ్యక్షుడిగాబలిజ నేతను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు మహిళ అధ్యక్ష పదవి నగరి నియోజకవర్గానికి చెందిన మీరాకు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది.
తిరుపతి అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి
తిరుపతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ కమిటీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణలతో ఈ పదవిని ఎస్సీ వర్గానికి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆమెకున్న విస్తృత పరిచయాలను దృష్టిలో వుంచుకుని జిల్లా అధ్యక్ష పదవికి ఆమె పేరు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. మంగళవారం మధ్యాహ్నానికంతా అధ్యక్ష పదవి పనబాక లక్ష్మికి దాదాపు ఖరారైందన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఇతర ఆశావహులు నిరుత్సాహానికి లోనయ్యారు.ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రస్తుత అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, వేనాటి సతీ్‌షరెడ్డి తదితరులు నిరుత్సాహానికి లోనైనట్టు తెలిసింది.