తమిళ జాలర్ల దౌర్జన్యం
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:44 AM
సముద్రంలో తమిళ జాలర్ల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రా సరిహద్దు భూ భాగంలోకి చొచ్చుకొచ్చి చేపలను వేటాడుతున్నారు. దీంతో 61 రోజుల చేపలవేట నిషేధం తర్వాత చేపలు పట్టేందుకు వెళుతున్న స్థానిక మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.
కోట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో తమిళ జాలర్ల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రా సరిహద్దు భూ భాగంలోకి చొచ్చుకొచ్చి చేపలను వేటాడుతున్నారు. దీంతో 61 రోజుల చేపలవేట నిషేధం తర్వాత చేపలు పట్టేందుకు వెళుతున్న స్థానిక మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు వెయ్యి బోట్లతో ఆంధ్రా జాలర్లు సముద్రంలోకి వెళ్తున్నారు. కోట, చిల్లకూరు, వాకాడు మండలాలకు చెందిన మత్స్యకారులు ఇందులో ఎక్కువగా ఉన్నారు. 450కు పైగా మోటరు బోట్ల సాయంతో చేపలను వేటాడుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన జాలర్లు ఆధునిక మెకనైజ్డ్ బోట్ల సాయంతో ఆంధ్రా సరిహద్దు భూ భాగంలోకి చొచ్చుకొని వస్తున్నారు. ప్రధానంగా సముద్రతీరం నుంచి 8 నాటికల్ మైళ్లు మాత్రమే తమిళనాడు సరిహద్దు ఉంది. దాన్ని దాటి వారు చేపలను వేటాడుతున్నారు. వారి వద్ద అధునాతన వలలు ఉండడంతో ఒకసారి విసిరితే 10 నుంచి 20 టన్నుల చేపలు పడుతున్నాయి. స్థానిక జాలర్ల వలలకు కేజీల్లో మాత్రమే చేపలు పడుతున్నాయి. ఈ క్రమంలో చేపలను తమిళ జాలర్లు పట్టుకునిపో తుండడంతో ఆంధ్రా జాలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 61 రోజుల చేపల వేట నిషేధం తర్వాత సముద్రంలోకి వెళ్లినా తమిళ జాలర్లు తమ కడుపు కొడుతున్నారని వాపోతున్నారు. ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తమకు ఉపాధి కరువవుతోందని, అధికారులు స్పందించి తమిళ జాలర్లను అడ్డుకోవాలని కోట మండలం గోవిందపల్లిపాళెం, శ్రీనివాససత్రం, చిల్లకూరు మండలం తమ్మినపట్నం, గుమళ్లదిబ్బ మత్స్యకార గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమకు వలసవెళ్లడం తప్ప తమకు వేరే మార్గం లేదని అంటున్నారు.