తిరుపతి మాజీ డీసీపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:36 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ పి.చంద్రమౌళీశ్వరరెడ్డిపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
దూరంగా, నాన్ ఫోకల్ పోస్టులో నియమించాలని ప్రభుత్వ ఆదేశం
ఓటరు కార్డుల వ్యవహారంలో కొనసాగనున్న విచారణ
తిరుపతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ కమిషనర్ పి.చంద్రమౌళీశ్వరరెడ్డిపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణను ప్రభావితం చేసే వీలు లేకుండా తిరుపతికి దూరంగా బదిలీ చేయాలని, నాన్ ఫోకల్ పోస్టులో నియమించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన పి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి 2021 నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పట్లో ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు తనకు తానే ఈఆర్వోగా వ్యవహరించారనేది ప్రధాన ఫిర్యాదు. ఆ హోదాలో ఎలాంటి క్లైమ్ ఫారాలూ లేకుండానే ఓటరు ఐడీ కార్డులను వేల సంఖ్యలో డౌన్‌లోడ్ చేశారనేది మరో ఆరోపణ. వీటిని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. దీంతో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటి దర్యాప్తునకు సిట్ కూడా ఏర్పాటైంది. ప్రాథమిక విచారణలో చంద్రమౌళీశ్వరరెడ్డి ఈసీ నోటిఫికేషన్ జారీ చేయకుండానే తనకు తానుగా తిరుపతి సెగ్మెంట్‌కు ఈఆర్వోగా ఎన్నికల్లో విధులు నిర్వర్తించినట్టు తేలింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈసీ ఆదేశించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 9న చంద్రమౌళీశ్వరరెడ్డిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేసే విషయమై గతేడాది సెప్టెంబరు 27న, ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల కమిటీ సమీక్షించినప్పటికీ ఆయనపై వచ్చిన ఆరోపణల తీవ్రత దృష్ట్యా కొనసాగించాలని నిర్ణయించింది. ఏడాది దాటినా తనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదని, తనను తిరిగి సర్వీసులోకి తీసుకోలేదని చంద్రమౌళీశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ (నంబరు 16450-2025)పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ క్రమంలో ఆగస్టు 21న ఉన్నతాధికారుల కమిటీ మరోసారి సమావేశమై చంద్రమౌళీశ్వరరెడ్డి సస్పెన్షన్‌పై సమీక్షించింది. విచారణ కొనసాగిస్తూనే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించింది. ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు నివేదించగా ఈసీ కూడా అంగీకరించింది. దీంతో చంద్రమౌళీశ్వర్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణను ప్రభావితం చేయకుండా అతడిని తిరుపతి కార్పొరేషన్‌కు సుదూరంగా బదిలీ చేయాలని, నాన్ ఫోకల్ పోస్టులో నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ పాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురే్‌షకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.