Share News

ఏసీబీ వలలో సర్వేయర్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:53 AM

భూమికి సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న సచివాలయ సర్వేయర్‌ను బుధవారం రాత్రి ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

ఏసీబీ వలలో సర్వేయర్‌
తహసీల్దార్‌ కార్యాలయంలో కేసు రికార్డును పరిశీలిస్తున్న ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి తదితరులు

పుంగనూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): భూమికి సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న సచివాలయ సర్వేయర్‌ను బుధవారం రాత్రి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఏఎస్పీ విమలకుమారి కథనం మేరకు... పుంగనూరుకు చెందిన బీజేపీ నాయకుడు, నాయిబ్రాహ్మణ సంఘ నేత ఉమాశంకర్‌, అతడి స్నేహితుడు షఫీ మంగళం గ్రామం కొత్తచెరువు వద్ద అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప వద్ద ఆరు నెలల క్రితం 8 కుంటల స్థలాన్ని కొనుగోలు చేసి అడ్వాన్సుగా రూ.4లక్షలు చెల్లించి సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు ప్రాంతానికి చెందిన శ్రీరాములు మంగళం సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. స్థలాన్ని సర్వే చేసి ఇవ్వాలని శ్రీరాములును కోరగా తనకు రూ.50 వేలిస్తే పాసుపుస్తకం చేసి ఇస్తానని చెప్పారు. చివరకు రూ.35 వేలకు ఒప్పందం చేసుకోవడంతో ఈనెల 10వ తేది భూమిని సర్వే చేశారు.ఈలోపు ఉమాశంకర్‌ తిరుపతిలో ఏసీబీ అధికారులను కలిసి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు సర్వేయర్‌ను పట్టుకోవడానికి వలపన్నారు.బుధవారం రాత్రి 7గంటలకు పుంగనూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉమాశంకర్‌ వద్ద శ్రీరాములు రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీ సోమన్న రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.సర్వేయర్‌ శ్రీరాములును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు విమలకుమారి తెలిపారు. ఏసీబీ దాడుల్లో సీఐలు వీవీ.రమణ, నరసింహారావు, విద్యాసాగర్‌, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏఎస్పీ విమలకుమారి మాట్లాడుతూ అవినీతి వ్యవహారాలేవైనా ప్రజల దృష్టికి వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తిరుపతి రేంజ్‌ పరిధిలో తనకు 9440446190, టోల్‌ఫీ నెంబరు 1064కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే అవినీతి అధికారులను పట్టుకుంటామని వివరించారు.

Updated Date - Dec 18 , 2025 | 12:53 AM