మామిడి రైతుకు మద్దతు ధర?
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:42 AM
మామిడి రైతుకు మద్దతు ధరను పటిష్ఠంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా సీఎంవో అధికారులు రెగ్యులర్‌గా కలెక్టర్ సుమిత్‌కుమార్, జిల్లాలోని ఇతర అధికారులతో మాట్లాడుతూ.. తగిన సూచనలిస్తూనే ఉన్నారు.

చిత్తూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుకు మద్దతు ధరను పటిష్ఠంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా సీఎంవో అధికారులు రెగ్యులర్‌గా కలెక్టర్ సుమిత్‌కుమార్, జిల్లాలోని ఇతర అధికారులతో మాట్లాడుతూ.. తగిన సూచనలిస్తూనే ఉన్నారు.
10 నుంచి అన్ని ఫ్యాక్టరీల్లో రూ.8
జిల్లాలో మొత్తం 35 ఫ్యాక్టరీలు, 38 ర్యాంపులున్నాయి. ప్రస్తుతానికి మద్దతు ధర ఇచ్చేందుకు ఐదు ఫ్యాక్టరీలవారు కలెక్టర్ ఎదుట అంగీకరించారు. మిగిలినవారు రూ.7 ఇస్తుండగా.. వారు కూడా రూ.8 ఇచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అన్ని ఫ్యాక్టరీల్లోనూ ఈ మద్దతు అమలయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో మద్దతు ధర రూ.12 అమలు కావాలని సీఎం స్పెషల్ సెక్రటరీ రాజమౌళి ఆదేశించారు. ఈ విషయంగా ఆయన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు తెరచుకునేలా, మద్దతు ధరను ఇచ్చేలా అధికారులు సిద్ధం చేశారు.
కృష్ణగిరిలో ధరలు పతనం..
కృష్ణగిరిలోని ఫ్యాక్టరీల్లో కిలో మామిడి రూ.5 నుంచి రూ.6 మధ్యలో అమ్ముడుబోతోంది. మన ప్రభుత్వం రూ.4 సబ్సిడీని ప్రకటించిన నేపథ్యంలో అక్కడి కలెక్టర్ కూడా తమిళనాడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయినా అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో అక్కడి రైతులు మన జిల్లాకు మామిడి కాయల్ని తెచ్చేస్తున్నారు. ఇలా అయితే మన రైతులకు అన్యాయం జరుగుతుంది. తమిళనాడు నుంచి మామిడి జిల్లాలోకి రాకుండా సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఇటీవల అధికారులకు ఆదేశించారు. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం కనీసం రూ.1 సబ్సిడీ ఇచ్చినా, అక్కడి రైతులు మన జిల్లాకు కాయల్ని తేవడం ఆపేస్తారు.
40 వేల టన్నుల పల్ప్ నిల్వలు
ఒకప్పటిలా మామిడి ఉత్పత్తులను ప్రజలు ఇబ్బడిముబ్బడిగా ఉపయోగించడం లేదు. వాటి అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో ఫ్యాక్టరీలు తయారు చేస్తున్న పల్ప్ ఎగుమతి కావడం లేదు. 2023, 2024 సంవత్సరాల్లో తయారుచేసిన పల్ప్ జిల్లాలోని ఫ్యాక్టరీల్లో సుమారు 40వేల టన్నులు అలాగే ఉండిపోయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలకు కూడా.. పల్ప్ కొనుగోలు చేసిన కంపెనీల నుంచి పెద్దఎత్తున బిల్లులు పెండింగులో ఉన్నాయి. దీంతో పల్ప్ ఫ్యాక్టరీలు కూడా మామిడి కాయలను కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నాయి.
నేటినుంచి ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద అధికారుల బృందాలు
జిల్లాలోని ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద విడతల వారీగా పనిచేయడానికి ఇప్పటికే ఉద్యోగుల్ని నియమించారు. వీఆర్వో, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు బృందంగా ఏర్పడి రైతుల వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ స్థానిక తహసీల్దార్ పర్యవేక్షణ చేయాలి. సోమవారం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగుల బృందాలు పనిచేయనున్నాయి.
12నుంచి పల్ప్ ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో క్రషింగ్ మొదలుపెట్టాలి
లేదంటే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది
మామిడి ధరల స్థిరీకరణ కమిటీ హెచ్చరిక
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు ఈనెల 12వ తేదీనుంచి పూర్తిస్థాయిలో క్రషింగ్ మొదలుపెట్టకుంటే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని మామిడి ధరల స్థిరీకరణ కమిటీ హెచ్చరించింది. ఆదివారం చిత్తూరులో కమిటీ సమావేశం రైతు త్యాగరాజరెడ్డి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం తోతాపురి కిలోకు రూ.4 ప్రోత్సాహకం అందజేస్తున్న తరుణంలో రైతులకు రూ.12 గిట్టుబాటు ధర చెల్లించాలని కమిటీ పునరుద్ఘాటించింది. కన్వీనర్లు ఆనంద నాయుడు, టి.జనార్దన్ తదితరులు మాట్లాడుతూ.. తోతాపురి మామిడి పక్వానికి వచ్చినా పొరుగురాష్ట్రాల నుంచి చౌకగా పొందేందుకోసం పల్ప్ ఫ్యాక్టరీలవారు ఇప్పటికీ క్రషింగ్ మొదలుపెట్టలేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కాయలు రాకుండా రైతులు సైతం ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. రైతు నాయకులు హరిబాబు చౌదరి, భారతి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఫ్యాక్టరీ ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు. ఫ్యాక్టరీకి తెచ్చిన కాయలను మూడు గంటల్లోగా అన్‌లోడింగ్ చేసేలా చూడాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు మామిడి రైతుల తరఫున వినతిపత్రం అందజేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గుణశేఖర్‌రెడ్డి, సంజీవిరెడ్డి, హరిబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.