Share News

చీకట్లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రి

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:34 AM

జనరేటర్‌ పనిచేయక ఇబ్బందులు సెల్‌ఫోను టార్చ్‌ వెలుగులో వైద్య సేవలు

చీకట్లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రి
చీకటిలో సెల్‌ఫోన్‌ లైట్‌వేసుకుని ఉన్న ఆస్పత్రి సూపరిండెంత్‌ డాక్టర్‌ రమేష్‌

సూళ్లూరుపేట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రిలో చీకట్లో వైద్య సేవలు అందించాల్సి వచ్చింది. ఆస్పత్రిలోని జనరేటర్‌ పనిచేయకపోవడంతో ఈ సమస్య నెలకొంది. ఆదివారం ఉదయం సూళ్లూరుపేట పట్టణం, మండలంలోని మన్నారుపోలూరు, మంగానెల్లూరు సబ్‌ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. మరమ్మతులు ఆలస్యం కావడంతో విద్యుత్‌ సరఫరాను రాత్రి 8 గంటలకు పునరుద్ధరించారు. పగలంతా వెలుతురు ఉండటంతో పెద్దగా ఇబ్బంది తలెత్తలేదు. కానీ, సాయంత్రం 6 గంటకు చీకటి పడడంతో ప్రభుత్వాస్పత్రిలోని అత్యసర విభాగంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ఇబ్బంది పడ్డారు. రోగుల బంధువుల సెల్‌ఫోన్ల టార్చిలైట్ల వెలుతురులోనే వైద్యం అందించారు. జనరేటర్‌ పనిచేయక పోవడంతో ఉదయం నుంచి ఆస్పత్రిలోని ఆయా వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్‌కు అంతరాయం కలిగినప్పుడల్లా రోగులకు అవస్థలు తప్పడంలేదు. ఆపరేషన్‌ చేసే సమయంలో కరెంట్‌ పోతే అంతే సంగతులు. ఇక, 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో సూళ్లూరుపేట పట్టణం, మండలంలోని మన్నారుపోలూరు, దామానెల్లూరు, ఉచ్చూరు, ఇలుపూరు, మంగళంపాడు, మంగానెల్లూరు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Jun 16 , 2025 | 12:34 AM