Share News

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జూడాలపై విద్యార్థుల దాడి

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:19 AM

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్ల (జూడాల)పై నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని శనివారం ఉదయం ఆస్పత్రిలోని జూడాలు విధులు బహిష్కరించి, ధర్నాకు దిగారు. పోలీసుల హామీతో విరమించారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జూడాలపై విద్యార్థుల దాడి
నిరసన తెలుపుతున్న జూనియర్‌ డాక్టర్లు

పగిలిన డాక్టర్‌ ముక్కు

ఆపై మహిళా వైద్యులతో అసభ్యకర ప్రవర్తన

నిందితులను అరెస్టు చేయాలని విధులు బహిష్కరించి డాక్టర్ల ధర్నా

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్ల (జూడాల)పై నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని శనివారం ఉదయం ఆస్పత్రిలోని జూడాలు విధులు బహిష్కరించి, ధర్నాకు దిగారు. పోలీసుల హామీతో విరమించారు.

ఏం జరిగిందంటే..

శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొందరు విద్యార్థులు మద్యం మత్తులో తమ స్నేహితుడి చేయికి దెబ్బ తగిలిందని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర విభాగానికి గుంపుగా వచ్చారు. డ్యూటీలోని వైద్యుడు పరిశీలించి స్కానింగ్‌ చేయించాలని చెప్పాడు. స్కానింగ్‌ కేంద్రం వద్దకెళ్లినవారు అక్కడ డ్యూటీలో ఉన్న రేడియాలజిస్ట్‌ డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం మొదలుపెట్టింది. ఆగ్రహించిన విద్యార్థులు ఆమెను నెట్టి.. ‘ఏం చేసుకుంటావో చేసుకో..బయటకు వస్తావు కదా.. నీకథ చూస్తాం’ అని వార్నింగ్‌ ఇచ్చారు. తర్వాత అక్కడున్న సిబ్బంది దెబ్బతిన్న విద్యార్థికి స్కానింగ్‌ తీసి, క్యాజువాలిటీకి వెళ్లాలని సూచించారు. రిపోర్టు తీసుకుని తిరిగి గుంపుగా క్యాజువాలిటీకి వచ్చిన విద్యార్థులు వైద్యులపై కామెంట్లు చేస్తూ.. అరుస్తూ... గొడవ చేశారు. దెబ్బతగిలిన వ్యక్తి వద్ద ఒక్కరుండి మిగిలినవారు బయట వేచి ఉండాలని అక్కడున్న వైద్యుడు సూచించారు. మమ్మల్నే బయట ఉండాలంటావా? అంటూ ఆ వైద్యుడిపై దాడి చేయడంతో ముక్కు పగిలింది. తర్వాత డ్యూటీలోని మరో ఇద్దరు డాక్టర్ల్‌పైనా సుమారు 15 మంది విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడి గాయపరిచారు. ఈ ఘటనతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో పరుగులు తీశారు.

చర్యలు తీసుకోవాలని ధర్నా

వైద్యులపై దాడికి పాల్పడిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని విధులు శనివారం ఉదయం విధులు బహిష్కరించి 300 మందికిపైగా జూడోలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులొచ్చి సర్దిచెప్పారు. దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేస్తామని టూటౌన్‌ సీఈ నెట్టికంఠయ్య హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

అవుట్‌ పోస్ట్‌, ఆస్పత్రి సెక్యూరిటీ వైఫల్యం

క్యాజువాలిటీలో అరుపులు, కేకలతో దద్దరిల్లుతుంటే.. క్యాజువాలిటీకి ఆనుకుని ఉన్న అవుట్‌ పోస్ట్‌లో సిబ్బందికి తెలియక పోవడం గమనార్హం. గతంలోనూ బయట గొడవపడి చికిత్స పొందుతున్న బాధితులపై క్యాజువాలిటీలోనే కత్తులతో దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా అవుట్‌పో్‌స్టలో పోలీసులు ఇలాగే ప్రవర్తించారని వైద్యులు గుర్తు చేశారు. ఉన్న ఒకరిద్దరు పోలీసులు రిటైర్‌మెంట్‌కు దగ్గర ఉన్నవారే కావడంతో ఉపయోగం లేదని ఆస్పత్రి సిబ్బందే చెబుతున్నారు. అదేసమయంలో ఆస్పత్రిలోని సెక్యూరిటీ పూర్తిగా విఫలమైంది. దాడి జరిగిన తర్వాత రావడంపై పలు విమర్శలొస్తున్నాయి.

బయట రక్షణ మాటేంటి : మహిళా జూడాలు

క్యాజువాలిటీలో 15 మంది వచ్చి డాక్టర్లును కొట్టి మళ్లీ బయటకొస్తే మీ అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. బయట మా రక్షణ మాటేంటని టూసీఐని మహిళా జూడాలు ప్రశ్నించారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగితే పోలీసులు దాడి చేసిన వారిని తీసుకెళ్లిపోయారు. వాళ్లు మరుసటి రోజే ఆస్పత్రిలో కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే దాడికి పాల్పడిన వారంతా గంజాయి తీసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

నేటినుంచి ఆస్పత్రి వద్ద ఇద్దరు ఏఆర్‌ పోలీసులు

ఈ ఘటనపై ఎస్పీ మణికంఠ ఆరా తీసినట్లు సమాచారం. వైద్యుల భద్రత కోసం ఆదివారం నుంచే ఇద్దరు ఏఆర్‌ పోలీసులకు 24 గంటలపాటు ఆస్పత్రి వద్ద డ్యూటీ వేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఆరుగురిపై కేసు నమోదు

బాధిత జూడాలు ఇచ్చిన ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సీఐ నెట్టికంఠయ్య తెలిపిన వివరాల మేరకు.. శనివారం రాత్రి 12.30గంటలకు బజారువీధికి చెందిన మొగిలీశ్వరన్‌ చేతికి గాయం కావడంతో అతడి స్నేహితులైన షరీఫ్‌, లోకేష్‌, యశ్వంత్‌, వినేష్‌, సందీ్‌పతో కలిసి చికిత్స చేసుకోవడానికి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స చేయించుకునే క్రమంలో వైద్యులు రక్షిత్‌, సరన్‌, యోగే్‌షలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో డాక్టర్‌ రక్షిత్‌పై మొగిలీశ్వరన్‌ దాడి చేశాడు. అనంతరం డాక్టర్లు మనోజ్‌కుమార్‌, మోహన్‌లు గాయపడిన డాక్టర్‌ రక్షిత్‌తో కలిసి అత్యవసర విభాగం గది ముందు మాట్లాడుకుంటుండగా.. మళ్లీ ఆరుగురు కలిసి వారిపై దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటనపై డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Updated Date - Sep 14 , 2025 | 01:19 AM