భక్తుల భద్రతే లక్ష్యంగా పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:34 AM
తిరుమలలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు2వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు సంతృప్తికరంగా స్వామిని దర్శించుకునేలా, లక్ష్యంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
ఈవో శ్యామలరావు ఆదేశం
తిరుమల, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు2వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు సంతృప్తికరంగా స్వామిని దర్శించుకునేలా, లక్ష్యంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని ఏడీ బిల్డింగ్‌లో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. గత బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి విజిలెన్స్, పోలీసు సిబ్బంది సమన్వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవలను ఇబ్బందులు లేకుండా వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి చెక్‌పాయింట్‌లో అదనంగా 12 స్కానర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. గరుడసేవ రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తిరుమల, తిరుపతిలో పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించాలన్నారు. అన్ని ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, సూచిక బోర్డులుఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపుఈవో వెంకయ్యచౌదరి(వర్చువల్‌గా), సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్‌ఎఅండ్ సీఎవో బాలాజీ, వీజీవో రాంకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.