నేటి నుంచే ‘స్త్రీ శక్తి’
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:24 AM
సూపర్‌సిక్స్ హామీల్లో ఒక్కటైన ‘స్త్రీ శక్తి’ పథకం శుక్రవారం సాయంత్రం అమలు కానుంది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నారు.
తిరుపతి(ఆర్టీసీ), ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ హామీల్లో ఒక్కటైన ‘స్త్రీ శక్తి’ పథకం శుక్రవారం సాయంత్రం అమలు కానుంది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నారు. తిరుపతి సీబీఎ్‌సలో, చంద్రగిరికి సంబంధించి మంగళంలో, శ్రీకాళహస్తి, పుత్తూరు, పిచ్చాటూరు, వెంకటగిరి, గూడూరు, వాకాడు, సూళ్లూరుపేట బస్సుస్టేషన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు లేదా రెండు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రె్‌సలను వరుసక్రమంలో ఉంచి పూజలు నిర్వహించి మహిళలను వరుసక్రమంలో ఎక్కిస్తారు. ఆ తర్వాత జెండా ఊపి బస్సును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4- 5గంటల మధ్య జరగనుంది. ఇప్పటికే జీరో టిక్కెట్ జారీపై కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాయంత్రం 5గంటల నుంచి ఈ-పాస్ యంత్రాలకు అనుమతి రానుంది. ఫొటోతో ఉన్న ఒరిజిల్ గుర్తింపు కార్డు నేరుగా గాని ఫోన్ ద్వారా గాని చూపించవచ్చు. గుర్తింపుకార్డులో చిన్న లోపం ఉన్నా ఉచితం వర్తించదు. మహిళలు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. మహిళల ఉచిత ప్రయాణం నేపథ్యంలో ప్రజారవాణాధికారి జగదీష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీటీఎం విశ్వనాధం, సీఎంఈ బాలాజీ, అన్ని డిపోల మేనేజర్లు ముందస్తు చర్యలు చేపట్టారు.