ఆగి..సాగిన కృష్ణా జలాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:42 AM
ఆదినేపల్లె పంప్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కృష్ణా జలాల పంపింగ్ ఆగింది.
వి.కోట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : వి.కోట మండలం ఆదినేపల్లె పంప్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కృష్ణా జలాల పంపింగ్ ఆగింది. హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ చివరి లిప్ట్ హౌస్‌లో ఎలుకల కారణంగా ప్యానెల్ బోర్డులో వైర్లు సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో కాలిపోవడంతో మోటార్లకు విద్యుత్ సరఫరా ఆగింది. గమనించిన హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులు సరిచేసేందుకు ప్రయత్నించారు.అయితే వాటికి సంబంధించిన పరికరాలు లభ్యం కాకపోవడంతో కాలువలో 24గంటల పాటు నీటిని పంపింగ్ చేయలేక నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు కాలువకు ఎగువనున్న పెద్దబరిణేపల్లె వెంగన్న చెరువు, దాసార్లపల్లె, ముదిమడుగు, పట్రపల్లె, పైపల్లె రాయప్ప చెరువుల వద్ద అమర్చిన తూములను కాస్త ఎత్తి చెరువులకు నీటిని విడుదల చేశారు.దీంతో దాసార్లపల్లె చెరువు 60 శాతం నీటితో కళకళలాడుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు కాలిన పరికరాల స్థానంలో కొత్తవి అమర్చి తిరిగి పంపింగ్ మొదలు పెట్టారు.అయితే వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హంద్రీనీవా కాలువలో మూడు రోజులకే నీళ్ళు ఆవిరయ్యాయంటూ ప్రచారం చేశారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు జరిగిన వాస్తవాలను తెలుపుతూ టీడీపీ గ్రూపుల్లో పోస్టు చేశారు.ఆదినేపల్లె లిప్టులో షార్ట్ సర్క్యూట్ జరిగి మరమ్మత్తులు జరుగుతున్నాయని, వైసీపీ విష ప్రచారం నమ్మెద్దంటూ ఆ పోస్టుల సారాంశం. మంగళవారం తిరిగి ఆదినేపల్లె లిప్ట్ హౌస్‌లో యధావిధిగా మోటార్లు పనిచేయడంతో కుప్పం పైపు గంగమ్మ పరవళ్ళు తొక్కింది. మంగళవారం నెర్నపల్లె పంచాయతీకి చెందిన అన్ని గ్రామాల ప్రజలు మిట్టూరు చెరువు వద్దకు చేరుకుని కృష్ణమ్మకు జలహారతులు ఇచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.