అయినా డ్రోన్ పట్టేసింది
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:54 PM
పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లిన ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): చుట్టూ ఎవరూ లేరనుకున్నారు. తమను ఎవరూ గమనించలేదనుకున్నారు. అలా పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లిన ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. మత్తులో తేలిపోతున్న ఆ యువకులను పోలీసు డ్రోన్ పట్టేసింది. డ్రోన్ కెమెరా ద్వారా ఆ దృశ్యాలను చూసిన కమాండ్ కంట్రోల్‌లోని సిబ్బంది సమాచారంతో తిరుపతి వెస్ట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం తిరుపతి ఇరిగేషన్ కార్యాలయం వెనుక వున్న పాడుబడ్డ బంగ్లాలో చోటుచేసుకుంది. లీలామహల్‌కు చెందిన పవన్, శ్రీనగర్‌కు చెందిన కుమార్ మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు తీసుకుంటుండగా డ్రోన్ కెమెరాతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పవన్ తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో వాటర్ క్యాన్లు సరఫరా చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడు కుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. వీరి నుంచి రెండు మత్తు ఇంజెక్షన్లు, డ్రగ్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్‌డీపీఎ్‌స చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని వైద్య పరీక్షల నిమిత్తం రుయాకు తరలించారు. తిరుపతిలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. కాగా, ఆ ఇద్దరు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెస్ట్ సీఐ మురళీమోహన్ చెప్పారు. వీరిని సోమవారం అర్బన్ తహసిల్దార్ ఎదుట హాజరుపరస్తామన్నారు. తమ పరిధిలో ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలా.. డ్రోన్ ఎగురుతూ ఉంటుంది
శివారు ప్రాంతాలు, పాడుబడిన భవనాల వద్ద ఎవరూ చూడరనే ఉద్దేశ్యంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే బుక్ అయిపోతారు. ఎందుకంటే అలాంటి చోట్ల పోలీసు డ్రోన్.. ఆకాశాన తిరుగుతూ, కెమెరాలతో నిఘా పెట్టి ఉంటుంది. భవిష్యత్తులో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హాస్టళ్ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.