ఏర్పేడు హౌసింగ్‌లో స్టీల్ గోల్‌మాల్
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:17 AM
ఏర్పేడు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. 34 లక్షల రూపాయల విలువైన స్టీల్‌ను అప్పటి అధికారులు స్వాహా చేశారు. ఇందులో ఎవరి పాత్ర ఏమిటో విచారణలో నిగ్గు తేల్చాల్సి ఉంది.
రూ.34 లక్షల విలువైన 44 టన్నులు మాయం
వైసీపీ హయాంలో జరిగినట్లు గుట్టురట్టు
ఏర్పేడు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఏర్పేడు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. 34 లక్షల రూపాయల విలువైన స్టీల్‌ను అప్పటి అధికారులు స్వాహా చేశారు. ఇందులో ఎవరి పాత్ర ఏమిటో విచారణలో నిగ్గు తేల్చాల్సి ఉంది. గత వైసీపీ పాలనలో అవుట్ సోర్సింగ్ కింద హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అమర్నాథ్‌ను మండల హౌసింగ్ ఏఈగా నియమించారు. ఆయన 2023 ఫిబ్రవరి నుంచి 2025 మార్చి 14వ తేదీ వరకు మండలంలో పనిచేశారు. చివర సంవత్సరంలో వంద టన్నుల స్టీల్ కావాలని జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు గోడౌన్ నుంచి స్టీలు మండలానికి తెప్పించుకున్నాడు. అందులో 56 టన్నులను మాత్రమే హౌసింగ్ లబ్ధిదారులకు పంపిణీ చేశాడు. మిగిలిన 44 టన్నులను స్వాహా చేశారు. దాని విలువ 34 లక్షల రూపాయలుగా ఉంది. ఇది అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో వారి కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
ఫ వెలుగులోకి వచ్చిందిలా..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పాలనలో జరిగిన ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. 44 టన్నుల స్టీలు గోల్‌మాల్ జరిగినట్లు తేలింది. కాగా, ఏ అధికారులైతే అవినీతి జరిగినట్లు గుర్తించారో వారే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి దీనికి వెనుక ఎవరు ఉన్నారనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. కాగా, మండల స్ధాయి నాయకులు హౌసింగ్ అధికారులను ప్రలోభాలకు గురిచేసి స్టీల్‌ను తమ ఇళ్లకు తరలించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన హౌసింగ్ డీఈ త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముంది.