సిబ్బంది లేక ఇబ్బంది
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:32 AM
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేదని ఫిర్యాదు చేస్తే సిబ్బంది వచ్చి సరిచేసేపాటికి రోజుల సమయం పడుతోంది.
విద్యుత్ శాఖలో 551పోస్టులు ఖాళీ
ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటైనా సిబ్బంది కేటాయింపులో నిర్లక్ష్యం
ముందుకు సాగని అభివృద్ధి పనులు
ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
చిత్తూరు రూరల్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేదని ఫిర్యాదు చేస్తే సిబ్బంది వచ్చి సరిచేసేపాటికి రోజుల సమయం పడుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే ఇక అంతే సంగతి. పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు ఫ్యూజులు పోయాయని సమాచారం ఇచ్చినా సిబ్బంది రాకపోవడంతో రైతులే సొంతంగా మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో అన్ని క్యాడర్లు కలిపి 551 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా నియామకాలు జరగడం లేదు.
ఇదీ పరిస్థితి..
నిబంధనల ప్రకారం ఏఈఈ 5 వేల సర్వీసులను పర్యవేక్షించాల్సి ఉండగా ప్రస్తుతం 9 నుంచి 10 వేల సర్వీసుల్ని చూస్తున్నారు. ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో రెండు సెక్షన్లు బాధ్యతలు ఒకరికే అప్పగించడంతో పాటు మరో సెక్షన్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. ఒక లైన్‌మెన్ వెయ్యి సర్వీసులను చూసుకోవాల్సి ఉండగా 3 నుంచి 4 వేల వరకు పర్యవేక్షిస్తున్నారు. ఒక సబ్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు లైన్‌మెన్ ఉండాల్సి ఉండగా ఒకరు కూడా లేని పరిస్థితి కొన్నింట్లో ఉంది.పంచాయతీకి ఒక లైన్‌మాన్ ఉండాల్సి ఉండగా 2, 3 పంచాయతీలకు ఒకరే ఉండటంతో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదు. సిటిజన్ చార్ట్ ప్రకారం విద్యుత్ సరఫరా ఆగితే ఫిర్యాదు అందిన 4 గంటలలోపు సరఫరాను పునరుద్ధరించాలి. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైతే పట్టణాల్లో 12, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోపు మార్పుచేసి సరఫరా ఇవ్వాల్సి ఉంది. ఈ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. ట్రాన్స్‌ఫార్మరు కాలిపోతే రోజుల తరబడి మార్చడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేటాయించింది 39... చేరింది 8 మందే
జిల్లా విభజన జరిగిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏడాది దాటుతున్నా... ఎస్‌ఈ కార్యాలయం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. నూతన ఎస్‌ఈ కార్యాలయానికి 39మంది సిబ్బందిని కేటాయిస్తే చేరింది కేవలం 8 మందే. మిగిలివారు ఎక్కడ పనిచేస్తున్నారనే విషయంపై ఉన్నతాధికారులకు కూడా క్లారిటీ లేకపోవడం విశేషం. ఎస్‌ఈ కార్యాలయానికి జేఏవోలు ఐదుగురిని, సీనియర్ అసిస్టెంట్లు 11మందిని, జూనియర్ అసిస్టెంట్లు 9మందిని, ఎస్‌సీజీ నలుగురిని, ఓఎ్‌సఓ ఏడుగురిని, వాచ్‌మెన్లు ముగ్గురిని కేటాయించారు. అయితే వారిలో జేఏవోలు ముగ్గురు, సీనియర్ అసిస్టెంటు ఒకరు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు మాత్రం విధుల్లో చేరగా మిగిలిన 31 మంది ఎక్కడ పనిచేస్తున్నారో అఽధికారులకు కూడా తెలియని పరిస్థితి. కార్యాలయం ఏర్పాటై సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు విధుల్లో చేరలేదని చిత్తూరు ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. దీంతో వారి పనుల భారం కూడా ఉన్నవారే మోయాల్సి వస్తోందని ఎస్‌ఈ వివరించారు.
17 కీలక పోస్టులు ఖాళీ
జిల్లాలో డీఈఈ ఒకటి, 11 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 15 జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్స్ డీఈఈ, టెక్నికల్ ఏఈఈ (ఎంఆర్‌టీ), టెక్నికల్ ఏఈఈ(కన్‌స్ట్రక్షన్స్),సంతపేట, చిత్తూరు రూరల్, ఐరాల అపరేషన్స్, ఐరాల రూరల్, అవులకొండ ఆపరేషన్స్, పెనుమూరు ఆపరేషన్స్, పలమనేరు ఆపరేషన్స్, వి.కోట ఆపరేషన్స్, కుప్పం అపరేషన్స్ ఏఈఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టుల్లో సబ్ ఇంజనీర్లు ఇన్‌చార్జ్ ఏఈఈలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్తూరు ఎప్పీఎం, కొంగారెడ్డిపల్లి, మిట్టూరు, ఐరాల రూరల్, బంగారుపాళ్యం రూరల్, పాలసముద్రం ఆపరేషన్స్, కార్వేటినగరం ఆపరేషన్స్, వెదురుకుప్పం ఆపరేషన్స్, పుంగనూరు డివిజన్ కార్యాలయం. పుంగనూరు కమర్షియల్, వి.కోట ఆపరేషన్స్, పెద్దపంజాణి, సదుం ఆపరేషన్స్, సోమల ఆపరేషన్స్ జూనియర్ ఇంజనీరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాం
చిత్తూరు ఎస్‌ఈ కార్యాలయానికి కేటాయించిన సిబ్బందిలో 90 శాతం మంది ఇంకా చేరలేదు. ముగ్గురు చేయాల్సిన పనులను ఒక్కరే చేస్తుండడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. తిరుపతి నుంచి చిత్తూరు రావాల్సిన సిబ్బంది రాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం.
ఇస్మాయిల్ అహ్మద్,ఎ్‌సఈ
-------------------------------------------------------------------------------------------------------------------------------------
పోస్టులు మంజురైనవి ఖాళీలు
-------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఈఈ 19 1
ఏఈఈ 59 11
జూనియర్ ఇంజనీరు 52 15
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 1 1
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 20 1
సీనియర్ అసిస్టెంట్ 80 10
జూనియర్ అసిస్టెంట్ 80 44
అటెండర్ 30 10
రికార్డ్ అసిస్టెంట్ 6 4
లైన్ ఇన్స్‌పెక్టర్ 82 1
లైన్‌మెన్ 292 4
లైన్‌మెన్ డ్రైవర్స్ 10 6
అసిస్టెంట్ లైన్‌మెన్ 271 209
జూనియర్ లైన్‌మెన్ 245 209
జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2 304 17
స్వీపర్ 13 2
వాచ్‌మెన్ 18 6
------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 1582 551
------------------------------------------------------------------------------------------------------------------------------------------