Share News

అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో సిబ్బంది చేతివాటం

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:48 PM

బ్యాటరీ సంస్థలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో  సిబ్బంది చేతివాటం
పోలీసుల అదుపులో చోరీకి పాల్పడ్డ నిందితులు (ఇన్‌సెట్‌లో) స్వాధీనం చేసుకున్న 27 టన్నుల లెడ్‌ బుష్‌ విడిభాగాలు

యాదమరి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండలం మోర్దానపల్లిలో గల అమరరాజా బ్యాటరీ సంస్థలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏకంగా రూ.2.73 కోట్ల విలువైన లెడ్‌ బుష్‌ (బ్యాటరీ విడిభాగాలను) మాయం చేసిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి,చోరీ చేసిన మెటీరియల్‌తో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌ సీఐ శ్రీధర్‌ నాయుడి కథనం మేరకు ....అమరరాజా మొబిలిటీ గ్రోత్‌ కారిడార్‌లో బ్యాటరీ విడిభాగాలు మాయమయ్యాయని సంస్థ జనరల్‌ మేనేజర్‌ రూపానంద్‌ కుమార్‌ మంగళవారం రాత్రి యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తును వేగవంతం చేశారు. వెస్ట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ నాయుడు, యాదమరి ఎస్‌ఐ ఈశ్వర్‌, సిబ్బంది బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.బుధవారం మధ్యాహ్నం రామభద్రాపురం ప్రాంతంలో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం బయటపడింది.ఇందుకు సంబంధించిన రూ.82 లక్షల విలువైన 27.6 టన్నుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మిగిలిన మెటీరియల్‌ అమ్మగా వచ్చిన రూ.68 లక్షలు నగదుతో పాటు రూ.1.18 కోట్ల విలువైన బంగారం రికవరీ చేశారు. ఈ దొంగతనం వెనుక సంస్థలో పనిచేసే సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ప్లాంట్‌ ఉద్యోగులు మహేంద్ర, గణేష్‌, ఢిల్లీబాబు, కృష్ణయ్య, హరితో పాటు స్ర్కాప్‌ కొనుగోలు చేసిన వ్యాపారి ఆరి్‌ఫను,సరుకు తరలింపునకు సహకరించిన వ్యాన్‌ డ్రైవర్‌ బాబును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద వున్న ఒక ఐచర్‌ వాహనం, ఒక అశోక్‌ లేల్యాండ్‌ దోస్త్‌ వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు.పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్‌ ఇండస్ట్రీ నుంచి అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లోని యూనిట్‌కు లెడ్‌ బుష్‌లను తరలించే ప్రక్రియలో పాల్గొన్న నలుగురు సిబ్బంది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు దాదాపు 91 టన్నుల లెడ్‌ బుష్‌ను స్ర్కాప్‌ వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది.

Updated Date - Nov 05 , 2025 | 11:48 PM