పింఛనుదారులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:53 AM
కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు ఒక్కో కాలనీ చొప్పున సుమారు 100-150 మంది పింఛనుదారులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం తెలిపారు.
కుప్పం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు ఒక్కో కాలనీ చొప్పున సుమారు 100-150 మంది పింఛనుదారులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం తెలిపారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ ఎస్సీ ఎస్టీ కాలనీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నంతో కలిసి పింఛన్లతోపాటు తనవెంట తెచ్చిన శ్రీవారి ప్రసాదమైన లడ్డూను పంపిణీ చేశారు. నిరుపేదల్లోనే దైవం కొలువుంటాడని భావించి, అటువంటి ప్రత్యక్ష దైవాలకు ఆ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని సభక్తికంగా సమర్పించుకుంటున్నామన్నారు. పింఛను నగదుతోపాటు వెలలేని శ్రీవారి లడ్డూ ప్రసాదం అందడంతో కాలనీ ప్రజలు అపరిమితమైన ఆనందం వ్యక్తం చేశారు.