శ్రీకాళహస్తి - తడ రోడ్డు సిక్స్ లేన్‌గా విస్తరణ!
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:19 AM
రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీసిటీ ఎస్‌ఈజెడ్‌కు నేరుగా రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశించిన కొత్త రోడ్డు నిర్మాణ ప్రతిపాదన రద్దయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఉన్న శ్రీకాళహస్తి-తడ రోడ్డును సిక్స్ లేన్ విస్తరించే ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది.
సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
ఎయిర్‌పోర్టు నుంచి శ్రీసిటీకి రోడ్డు ప్రతిపాదన రద్దుతో ప్రత్యామ్నాయ చర్యలు
రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీసిటీ ఎస్‌ఈజెడ్‌కు నేరుగా రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశించిన కొత్త రోడ్డు నిర్మాణ ప్రతిపాదన రద్దయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఉన్న శ్రీకాళహస్తి-తడ రోడ్డును సిక్స్ లేన్ విస్తరించే ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌కు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తామని ఈ ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధులు తరచూ శ్రీసిటీకి రాకపోకలు సాగించే నేపథ్యంలో ఎయిర్ పోర్టు నుంచి త్వరగా శ్రీసిటీ చేరేలా రోడ్డు యాక్సెస్ కల్పించాలని సీఎం భావించారు. దీంతోపాటు కొత్త రోడ్డు నిర్మాణం వల్ల రేణిగుంట, శ్రీసిటీల నడుమ ఇప్పటి దాకా మారుమూల వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్న ప్రాంతాలకు, అక్కడి భూములకు విలువ పెరుగుతుందని, పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులు వస్తాయని భావించారు. కొత్తగా నిర్మించే సిక్స్ లేన్ రోడ్డును ఆధారంగా చేసుకుని ఆ మార్గంలో కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయవచ్చని కూడా తలపోశారు. దానికనుగుణంగా ఎయిర్ పోర్టు నుంచి శ్రీకాళహస్తి మీదుగా ఇప్పుడున్న మార్గంలో కాకుండా రేణిగుంట నుంచి శ్రీసిటీకి కొత్త రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. దానిపై కలెక్టర్‌తో చర్చించి సర్వే చేయించాలని ఆదేశించారు. ఇటీవల శ్రీసిటీని సందర్శించిన సందర్భంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సైతం శ్రీసిటీ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచుతామని ప్రకటించారు.
కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవసరమని అంచనా
ప్రాథమిక సర్వేలో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా శ్రీసిటీకి సిక్స్ లేన్ రోడ్డు నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తేలింది. ప్రతిపాదిత మార్గంలో విలువైన పంట భూములు ఉండడం వల్ల వాటికి పరిహారం కింద ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడైంది. మరోవైపు మార్గంమధ్యలో అడ్డుపడే కొండ ప్రాంతాల మీదుగా రోడ్డు నిర్మాణానికి సాధారణ అంచనా వ్యయానికి మించి అనేక రెట్లు అధికంగా ఖర్చవుతుందని తేలింది. కనీసం రూ.4 వేల కోట్లు అవసరమవుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎం చంద్రబాబుకు నివేదించారు. ఇప్పటికే రేణిగుంట నుంచి నాయుడుపేట, సూళ్లూరుపేట మీదుగా తడకు సిక్స్ లేన్ రోడ్డు కొత్తగా నిర్మాణం జరిగి ఉండడం, ఆ మార్గంలో తడకు చేరుకోవడానికి గంటన్నర సమయం మాత్రమే పడుతున్నందున మళ్లీ ఎయిర్ పోర్టు నుంచి శ్రీసిటీకి ప్రత్యేకంగా కొత్త రోడ్డు అవసరం లేదని సీఎంకు వివరించారు.
ప్రత్యామ్నాయంగా శ్రీకాళహస్తి-తడ రోడ్డు విస్తరణ ప్రతిపాదన
ఒకవేళ ప్రత్యామ్నాయం అవసరమని భావిస్తే ఇప్పటికే శ్రీకాళహస్తి నుంచి పదో మైలు, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం మీదుగా తడ వరకూ ఉన్న డబుల్ రోడ్డును విస్తరిస్తే సరిపోతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ రోడ్డును డబుల్ రోడ్డు నుంచి ఫోర్ లేన్‌గా విస్తరించేందుకు ప్రతిపాదనలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించామని, సీఎం ఆసక్తి కారణంగా ఆ ప్రతిపాదనలను సిక్స్ లేన్‌కు మార్చుకుంటే సరిపోతుందని నివేదించారు. దీంతో శ్రీకాళహస్తి నుంచి బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం మీదుగా తడ వరకు ఇపుడున్న డబుల్ రోడ్డును సిక్స్ లేన్ రోడ్డుగా విస్తరించేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. కాగా శ్రీకాళహస్తి నుంచి ఇప్పుడున్న సిక్స్ లేన్ రోడ్డు మార్గంలో తడ 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే శ్రీకాళహస్తి నుంచి బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం మీదుగా తడ నడుమ దూరం కేవలం 42 కిలోమీటర్లు మాత్రమే. కేవలం గంట వ్యవధిలో శ్రీసిటీకి చేరుకునే అవకాశముంటుంది. నిర్మాణ వ్యయం కూడా భారీగా తగ్గనున్న కారణంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదన పట్ల సీఎం చంద్రబాబు మొగ్గు చూపించారు. ఆ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి - బీఎన్ కండ్రిగ - వరదయ్యపాలెం- తడ రోడ్డును సిక్స్ లేన్ రోడ్డుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో పడ్డారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ పనులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించే అవకాశముంది.