శ్రీగంధాన్నీ వదల్లేదు
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:14 AM
శేషాచల అడవుల్లో నరికేస్తున్న ‘ఎర్ర’ స్మగ్లర్లు తలలు పట్టుకుంటున్న టాస్క్‌ఫోర్సు, అటవీశాఖ అధికారులు
మంగళం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నేలకూలుస్తున్న స్మగ్లర్ల దృష్టి శ్రీగంధంపై పడింది. శేషాచల కొండల్లోకి తొలుత అడుగుపెట్టిన స్మగ్లర్లు అటవీశాఖ గుర్తించడానికి ముందే శ్రీగంధంచెట్లను నరికి తరలించేశారు. ఆ తర్వాత ఎర్రచందనంపైకి దృష్టి మళ్లించారు. తాజాగా ఇప్పుడు శ్రీగంధం చెట్లపై కూడా దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం నాలుగు రోజుల కిందట తిరుమల కొండల్లోని జపాలి వద్ద శ్రీగంధం చెట్టు మొదళ్లతో పాటు పెకలించి తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకోవడం. అంతకుముందు కపిలతీర్థం వద్ద శ్రీగంధంచెట్లను వేళ్లతో పెకలించి అక్రమంగా తరలిస్తూ అటవీశాఖ అధికారులకుచిక్కారు. దీంతో అటవీశాఖ, టాస్క్‌ఫోర్సు అధికారులు ఏం చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఎర్రచందనం కన్నా శ్రీగంధానికి అధిక డిమాండ్, ధర ఉండటంతో శేషాచల కొండల్లోని చిన్నపాటి శ్రీగంధం చెట్లనూ స్మగ్లర్లు వదిలిపెట్టడం లేదు. ఇలా శ్రీగంధం చెట్లను స్మగ్లర్లు నరికి తరలిస్తుండటంతో టీటీడీ.. తిరుమల కొండలపై ప్రత్యేకంగా శ్రీగంధం వనానికి శ్రీకారంచుట్టింది. 60 హెక్టార్లలో లక్షలాది మొక్కలు నాటి వాటిచుట్టు కంచె వేసి కాపాడుకుంటోంది. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు.. ఇక్కడి శ్రీగంధం వనంపై ఎక్కడ చూపు పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్మగ్లర్లు తరలిస్తుండగా పట్టుకున్న శ్రీగంధం నాలుగు టన్నుల వరకు చిత్తూరులోని గోదాములో ఉంది. ఇక, అటవీశాఖ, పోలీసులకు చిక్కకుండా ఎంతమేరకు శ్రీగంధం రాష్ట్ర సరిహద్దులు దాటిందో అంతుచిక్కని పరిస్థితి. ఈ క్రమంలో టీటీడీ పరిధిలోని శ్రీగంధం చెట్లకు స్మగ్లర్ల బెడద లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.