ఐఐటీలో క్రీడల పండగ
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:49 AM
ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం 58వ ఇంటర్ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. ఇంటర్ స్పోర్ట్స్ మీట్ పతాకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి ఐఐటీ స్పోర్ట్స్ సెక్రటరీ స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి పోటీలను ప్రారంభింపజేశారు.
ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏర్పేడు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం 58వ ఇంటర్ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. ఇంటర్ స్పోర్ట్స్ మీట్ పతాకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి ఐఐటీ స్పోర్ట్స్ సెక్రటరీ స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి పోటీలను ప్రారంభింపజేశారు. వెయిట్ లిఫ్టింగ్, చదరంగం, టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. దీనికోసం 23ఐఐటీల నుంచి విద్యార్థులు వచ్చారు. ఆయా పోటీలకు సంబంధించి తీవ్రంగా సాధన చేశారు. 20వ తేదీ వరకు దశలవారీగా నిర్వహించే పోటీల్లో ప్రతిభ చూపిన వారికి 21న ప్రశంసాపత్రాలు అందిస్తారు. ఇంటర్ ఐఐటీ క్రీడలు విద్యకుమించి వ్యక్తిత్వం, క్రీడా స్ఫూర్తి, సహనం, నాయకత్వాన్ని పెంపొందిస్తాయని ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. మద్రాస్, హైదరాబాద్ ఐఐటీలతో కలిసి ఈ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించ గొప్ప అవకాశం కలిగిందన్నారు.
కఠోర శ్రమతో సాధించొచ్చు
‘నేను వేలూరు సమీపంలోని ఓ పల్లెటూరులో జన్మించా. తండ్రి సూచనతో 15ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంచుకున్నా. నా శరీర ఆకృతిని చూసి నేను పనికిరానని ఎద్దేవా చేశారు. అప్పుడే నేను ప్రపంచస్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని లక్ష్యం పెట్టుకున్నన. కఠోర శ్రమతో రాణిస్తూ కామన్వెల్త్ క్రీడల్లో బంగారుపతకం సాధించా. 2016 రియో ఒలంపిక్స్‌లో ఇండియా తరపున ఆడా. 2018నుంచి ఖేలో ఇండియా పేరుతో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. భారతదేశం బహుక్రీడా దేశంగా ఎదుగుతోంది. ఈ అవకాశాలను వినియోగించుకుని భవిష్యత్తు చాంపియన్లుగా ఎదగాలి’ అంటూ విద్యార్థులకు ముఖ్య అతిథి, అర్జున అవార్డు గ్రహీత సతీష్ శివలింగం సూచించారు. ఐఐటీ విద్యార్థులు ఆవిష్కర్తలు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగానే కాకుండా క్రీడల్లోనూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.