Share News

కేంద్ర నిధులు ఖర్చు చేయండి

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:27 AM

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా జిల్లాకు కేటాయించే నిధులను సకాలంలో ఖర్చు చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అధికారులను ఆదేశించారు.

కేంద్ర నిధులు ఖర్చు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, చిత్రంలో ఎంపీ గురుమూర్తి

వెనక్కిపోయే ప్రమాదం ఉంది

దిశ సమీక్ష సమావేశంలో ఆందోళన

శ్రీకాళహస్తి కమిషనర్‌ గైర్హాజరు... క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

తిరుపతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా జిల్లాకు కేటాయించే నిధులను సకాలంలో ఖర్చు చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్‌లో జరిగిన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణా కమిటీ) త్రైమాసిక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సకాలంలో వాటిని వినియోగించుకోకపోతే వెనక్కి వెళతాయని, తిరిగి విడుదలయ్యే అవకాశమే ఉండదని అన్నారు. అనంతరం వివిధ పథకాల అమలు తీరును కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌తో కలసి సమీక్షించారు.

పీఎం ఆదర్శ గ్రామాలకు రూ.10 కోట్లిస్తే ఖర్చు పెట్టింది రూ.1.11 కోట్లే!

పీఎం ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఈ ఏడాది మేలో రూ.10.33 కోట్లు సర్దుబాటు కాగా అందులో ఇప్పటి దాకా కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం పట్ల ఎంపీ, కలెక్టర్‌ ఇరువురూ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబరు 31వ తేదీలోపు నిధులను ఖర్చు చేయకుంటే వెనక్కిపోతాయని హెచ్చరించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చెరువుల్లో గుంతలు తవ్వడమే ఉపాథా?

ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో కేవలం చెరువుల్లో గుంతలు తవ్వే పనులు తప్ప వేరే పనులు ప్రతిపాదించడం లేదని డ్వామా శ్రీనివాస ప్రసాద్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. గతేడాది రూ.157 కోట్ల పనులు చేపట్టగా అందులో ఇంకా రూ.46 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. రూ.8.98 కోట్లతో సీసీ రోడ్లు, రూ.10.39 కోట్లతో బీటీ రోడ్లు కొత్తగా చేపడతామన్నారు. రోడ్‌ కనెక్టివిటీ లేని గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే శ్మశాన వాటికలకు దారులు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఎంపీ, కలెక్టర్‌ ఆదేశించారు. నాయుడుపేట మండలంలో సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు కట్టి మూడేళ్లవుతున్నా ఫైనల్‌ బిల్లులు మంజూరు కాలేదని ఎంపీపీ ధనలక్ష్మి ఫిర్యాదు చేశారు. బిల్లుల మంజూరులో వివక్ష ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జిల్లాలో 24 వేల ఇళ్లు పూర్తి

హౌసింగ్‌పై సమీక్షలో జిల్లాలో 37,400 ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటికి 24,390 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని జిల్లా హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు చెప్పారు.

181 చెరువుల అభివృద్ధికి రూ.515 కోట్లతో ప్రతిపాదనలు

జలవనరుల శాఖలో ట్రిపుల్‌ ఆర్‌ కార్యక్రమం కింద ఎక్కువ ఆయకట్టు కలిగిన 181 చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ.515 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని ఆ శాఖ అధికారులు చెప్పారు. ఈ పనులకు 60-40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు నిధులు కేటాయించాల్సి ఉందని, అలాగే కాలువల అభివృద్ధికి మరో రూ.200 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జిల్లాలో తరచూ తుఫాన్ల బెడద ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలకు 570 పనులు ప్రతిపాదించామని వివిరించారు.

జిల్లాకే సీఎ్‌సఆర్‌ నిధులు

జిల్లాలోని పరిశ్రమల నుంచి రూ.180 కోట్లు సీఎ్‌సఆర్‌ కింద రావాల్సి ఉందని, ఈ నిధులను జిల్లా అవసరాలకే వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

శ్రీకాళహస్తి కమిషనర్‌పై చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

కాగా దిశ సమావేశానికి శ్రీకాళహస్తి మున్సిపల్‌ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌ గైర్హాజరయ్యారు. ఆయనకు బదులు మున్సిపల్‌ కార్యాలయం నుంచి వచ్చిన మహిళా ఉద్యోగి ఒకరు సమాధానమిచ్చారు. దీనిపై కలెక్టర్‌ ఆగ్రహించారు. కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీలు, డీఆర్వో నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 01:27 AM