Share News

మహిళల భద్రత కోసం డ్రోన్లతో ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:27 AM

మహిళల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా డ్రోన్లతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.

 మహిళల భద్రత కోసం డ్రోన్లతో ప్రత్యేక నిఘా

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా డ్రోన్లతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. బుధవారం మహిళలు వాకింగ్‌ చేసే కట్టమంచి చెరువు, ఫారెస్టు, పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో డ్రోన్లతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా మహిళలు వాకింగ్‌తో పాటు వ్యాయామం చేసుకోవచ్చన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, వాకింగ్‌ చేసే ప్రాంతాల్లో డ్రోన్లతో ఉదయం, సాయంత్రం నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కట్టమంచి వాకింగ్‌ ట్రాక్‌, పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల మైదానం, మెసానికల్‌ మైదానంలో డ్రోన్‌తో నిఘా ఉంచామని చెప్పారు. ఇకపై రోజూ డ్రోన్ల నిఘా ఉంటుందని, ఎక్కడైనా జరగరానిది జరిగితే తక్షణం పోలీసులు అక్కడికి చేరుకుంటారని తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 01:28 AM