భూ సంబంధిత అర్జీలపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:38 AM
పీజీఆర్‌ఎ్‌సలో వచ్చే భూ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించండి..
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘పీజీఆర్‌ఎ్‌సలో వచ్చే భూ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించండి.. చిన్న చిన్న కారణాలతో పక్కనపెట్టొద్దు’ అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కారవేదికకు మంత్రి రాగా, అర్జీదారులు సమస్యలను ఏకరువుపెట్టారు. ఆధారాలతో వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్జీదారులతో మాట్లాడి పీజీఆర్‌ఎ్‌సలో అధికారుల తీరుపై ఆరా తీశారు. అర్జీదారులకు రసీదులు ఇచ్చే కౌంటర్‌ను తనిఖీ చేశారు. చిన్న చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించవద్దని అధికారులకు సూచించారు.
పోటెత్తిన అర్జీదారులు
కలెక్టరేట్ పీజీఆర్‌ఎ్‌సకు అర్జీదారులు పెద్దయెత్తున హాజరయ్యారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 200 పింఛన్లను మంజూరు చేసే విచక్షణా అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించిన నేపథ్యంలో దివ్యాంగులతో కలెక్టరేట్ నిండిపోయింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసే బాధ్యత తనదని కలెక్టర్ వెంకటేశ్వర్ హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. కాగా, ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పీజీఆర్‌ఎ్‌సకు 412 అర్జీలు వచ్చాయి.