Share News

ఐఐటీ వద్ద స్పేస్‌ సిటీ

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:46 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏరో స్పేస్‌ సిటీ ఏర్పేడు సమీపంలో రూపుదిద్దుకోనుంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌కీ, శ్రీసిటీ సెజ్‌కీ సమీపంలో ఉండేలా ఐఐటీ వద్ద 15 ఎకరాల భూమిని అధికారులు ఇందుకోసం గుర్తించారు.

ఐఐటీ వద్ద స్పేస్‌ సిటీ

15 ఎకరాలు గుర్తించిన అధికారులు

తిరుపతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏరో స్పేస్‌ సిటీ ఏర్పేడు సమీపంలో రూపుదిద్దుకోనుంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌కీ, శ్రీసిటీ సెజ్‌కీ సమీపంలో ఉండేలా ఐఐటీ వద్ద 15 ఎకరాల భూమిని అధికారులు ఇందుకోసం గుర్తించారు. డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు అయిన డాక్టర్‌ జి.సతీ్‌షరెడ్డి ఇందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటీవల ఆయన జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు. ఆయన సూచన మేరకే ఐఐటీ వద్ద భూములను జిల్లా కలెక్టర్‌ గుర్తించారు. త్వరలోనే దాన్ని డీఆర్‌డీవోకు అప్పగించనున్నారు. డీఆర్‌డీవోకి అనుబంధంగా ఏర్పాటు కానున్న స్పేస్‌ సిటీలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్పత్తి కార్యకలాపాలన్నీ షార్‌ సమీపంలో జరుగుతాయని తెలుస్తోంది.

అవిలాలలో పర్యాటక శాఖకు పది ఎకరాలు

ఇక తిరుపతి రూరల్‌ మండలం అవిలాల రెవిన్యూ గ్రామ పరిధిలో అత్యంత విలువైన పది ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖకు కేటాయించింది. డీకేటీ పట్టాల పేరిట ఇతరుల అనుభవంలో ఉన్న ఈ భూములను స్వాధీనం చేసుకుని ఏపీ టూరిజం అథారిటీకి అప్పగించింది. పర్యాటక శాఖ ఆ భూమిని అభివృద్ధి చేసి ఆతిధ్య రంగానికి సంబంధించి ఫైవ్‌ స్టార్‌ లగ్జరీ హోటల్‌ లేదా రిసార్టులకు కేటాయించనుంది. అలాగే దామినీడు పరిధిలో స్వాధీనం చేసుకున్న భూముల్లో 28 ఎకరాలను పర్యాటక శాఖకు, 34 ఎకరాలను స్పోర్ట్స్‌ కాంప్లెక్సు నిర్మాణానికి, 14 ఎకరాలను జిల్లా కోర్టు భవనాల సముదాయానికి కేటాయించారు. పర్యాటక శాఖకు కేటాయించిన భూముల్లో రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళు రానున్నాయి.

సెమీ కండక్టర్‌ పరిశ్రమ మనకేనా?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన సెమీ కండక్టర్‌ పరిశ్రమకు తిరుపతి జిల్లానే అనువైనదని భావిస్తున్నట్టు తెలిసింది. కొప్పర్తి, ఓర్వకల్లు, తిరుపతిలలో ఒక చోట దీనిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే ఎలకా్ట్రనిక్‌ మానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు, సంబంధిత పరిశ్రమలున్న తిరుపతి జిల్లానే ఎక్కువ అనువైనదని అంటున్నారు. తిరుపతి జిల్లాకు చెన్నై, బెంగుళూరు నగరాలు చేరువగా వుండడం కూడా అనుకూలాంశం. తిరుపతి జిల్లాను ఎంపికచేస్తే అప్పగించడానికి వీలుగా వడమాలపేట మండలం ఎస్వీపురం వద్ద 600 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు తెలిసింది. జిల్లాకు ఈ యూనిట్‌ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు సైతం గణనీయంగా మెరుగుపడతాయి. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది.

Updated Date - Aug 24 , 2025 | 01:46 AM