త్వరలో జిల్లాకు 2500 టన్నుల యూరియా
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:51 AM
జిల్లా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర యూరియా సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర యూరియా సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1500 టన్నుల యూరియా నిల్వలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. త్వరలో 2500 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, ఇప్పటికే రైతుల వద్ద మరో 2600 టన్నుల నిల్వ ఉన్నాయన్నారు. రైతులు తప్పనిసరిగా వేలి ముద్రలు నమోదు చేసి ఆధార్ ఆధీకృత విధానం ద్వారా యూరియాను కొనుగోలు చేయాలన్నారు. చాలా చోట్ల రైతులు పశుగ్రాసం కోసం మోతాదుకు మించి యూరియాను వినియోగిస్తున్నారని, ఈ అలవాట్లు తగ్గించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాను అందుబాటులోకి తెస్తున్నామని, ముందస్తుగా అధిక ధరలకు కొనుగోలు చేయొద్దని కలెక్టర్ విజ్ఞప్తిచేశారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలని, వారిపై ఎరువుల చట్టం ప్రకారం కఠిన చర ్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకోసం చిత్తూరులో కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 8331057732 లేదా 8331057741 ఫోన్ నెంబర్లకు రైతులు ఫిర్యాదు చేయాలని, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, నగరి డివిజన్లలో సైతం కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమయానుకూలంగా యూరియా అందుతోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.