కుప్పంలో సోలార్ సెన్సార్
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:23 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడానికి ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పించడానికి ముందుకొస్తున్నాయి.ప్రత్యేకించి కుప్పం పురపాలక సంఘం, కుప్పం రెస్కో ఇందులో ఒకడుగు ముందుకేశాయి.
కుప్పం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడానికి ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పించడానికి ముందుకొస్తున్నాయి.ప్రత్యేకించి కుప్పం పురపాలక సంఘం, కుప్పం రెస్కో ఇందులో ఒకడుగు ముందుకేశాయి. ప్రత్యేక సోలార్ సెన్సార్ పరికరాన్ని అమర్చడం ద్వారా వీధి విద్యుత్తు బల్బులు వాటికవే ఆన్ అండ్ ఆఫ్ అయ్యే సోలార్ ఫొటో సింథసిస్ టెక్నాలజీని ప్రస్తుతం వినియోగంలోకి తీసుకు వచ్చారు. పురపాలక సంఘం పరిధిలోని కమతమూరులో కుప్పం రెస్కో ద్వారా, కడా పైలెట్ ప్రాజెక్టుగా శుక్రవారం ప్రారంభించారు.ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, రెస్కో చైర్మన్ వీజీ.ప్రతాప్, రెస్కో ఎండీ సోమశేఖర్, కడా రాజకీయ సలహా మండలి సభ్యుడు రాజ్‌కుమార్ ఈ ఆధునిక సాంకేతికతను ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీలో భాగంగా ప్రతి 24 విద్యుత్తు స్తంభాలకు కలిసి ప్రత్యేకమైన ఒక పరికరాన్ని అమర్చి విద్యుత్తు మీటరుకు అనుసంధానిస్తారు. ఈ సాంకేతికపరమైన అమరిక ద్వారా వీధుల్లోని విద్యుత్తు బల్బులు, సూర్యరశ్మి ఉన్న పగటి వేళల్లో వాటికవే ఆరిపోయి, లేని సమయంలో అంటే చీకటి పడ్డాక వాటికవే వెలుగుతాయి. ఇందువల్ల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతుండే సమస్య తప్పిపోతుంది. తద్వారా విద్యుత్తు వినియోగం అదుపులోకి వచ్చి బిల్లులు తగ్గుతాయి.మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం, రెస్కో డైరెక్టర్ తులసీనాథ్, టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.