Share News

విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:45 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గాలికొదిలేశారు. ఏ భవనం చూసినా విరిగిన కిటికీలు.. దుర్గంధం వెదజల్లే మరుగుదొడ్లు.. పెచ్చులూడే స్లాబ్‌లే దర్శనమిచ్చేవి. నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. దీనివల్ల ఇక్కడుండే ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వసతి గృహాలన్నీ కళకళలాడుతున్నాయి.

 విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు
ఎల్లంకివారిపల్లెలోని వసతి గృహం

వైసీపీ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గాలికొదిలేశారు. ఏ భవనం చూసినా విరిగిన కిటికీలు.. దుర్గంధం వెదజల్లే మరుగుదొడ్లు.. పెచ్చులూడే స్లాబ్‌లే దర్శనమిచ్చేవి. నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. దీనివల్ల ఇక్కడుండే ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం వసతి గృహాలన్నీ కళకళలాడుతున్నాయి.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

జిల్లాలో 57 ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రైవేటు భవనాల్లో నడుస్తుండగా, మూడు భవనాలు బాగానే ఉన్నాయి. మిగిలిన 48 వసతి గృహాల్లో మరమ్మతులకు జిల్లా యంత్రాంగం నివేదిక పంపగా రాష్ట్ర ప్రభుత్వం రూ.11.83 కోట్లను విడుదల చేసింది. దాంతోపాటు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.48లక్షలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలోనే పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, సోషల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌, సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్‌) శాఖలకు పనులను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అప్పగించారు. ఒక్కో శాఖ.. ఒక్కో నియోజకవర్గంలోని వసతి గృహాల బాధ్యత తీసుకోవాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పనులు కూడా వేగంగా జరగడంతో కొన్నిచోట్ల వందశాతం, మరికొన్ని చోట్ల 90శాతం వరకు పూర్తయ్యాయి.

ఏయే పనులు చేశారంటే..

మరుగుదొడ్లు, కిటికీలు, ఫ్లోరింగ్‌, శ్లాబ్‌, తలుపులు, వాటర్‌ పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయడంతోపాటు కిటికీలకు దోమల మెష్‌, లైటింగ్‌, ఫ్యాన్ల ఏర్పాటు, సెప్టిక్‌ ట్యాంకు క్లీనింగ్‌, రెండుమూడు చోట్ల ప్రహరీల నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు అన్ని భవనాలకు పెయింటింగ్‌ చేశారు.

నాణ్యమైన భోజనం అందించే దిశగా..

గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మాత్రమే కాస్మెటిక్‌, డైట్‌ చార్జీలను పెంచింది. పెంచిన మేరకు నిధులను విడుదల చేయకపోవడంతో పాత డైట్‌ చార్జీలతోనే విద్యార్థులకు మెనూను అమలు చేశారు. దీనివల్ల చాలీచాలనీ ఆహారాన్ని విద్యార్థులకు పెట్టేవారు. ఈ కారణంగా ఒక్కో హాస్టల్‌లో వంద మంది విద్యార్థులకు 20 నుంచి 50 వరకే పరిమితమయ్యారు. ఈ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టింది.

ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలతోపాటు వసతి గృహాలు కూడా తెరచుకోనున్నాయి. అన్ని వసతులు కల్పించడంతో ఈ ఏడాది వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:45 AM