‘విశాఖ’ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:18 AM
తిరుపతి నుంచి విశాఖ వెళ్లే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్(08548) ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.
తిరుపతి(సెంట్రల్), నవంబరు13(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి విశాఖ వెళ్లే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్(08548) ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. విశాఖ నుంచి ఈ ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకొంది. తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్‌లో రాత్రి 9.50 గంటలకు 6వ నెంబరు ప్లాట్ ఫారం నుంచి బయలుదేరాలి. రైలు బయలుదేరిన వెంటనే బి-3 ఏసీ కోచ్‌లో సిబ్బంది ఏసీ ఆన్ చేశారు. ఆన్ చేసిన వెంటనే ప్యానల్ బోర్డులో ఉన్నపళంగా పొగలు రావడంతో ఏసీ సిబ్బంది, ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సిబ్బంది చాకచక్యంగా చైన్‌పుల్ చేసి రైలును ఆపారు. ఎలాంటి మంటలు చెలరేగక పోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక శాఖల సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతులు చేశారు. ఈ రైలు గంటకుపైగా ఆలస్యంతో బయలుదేరినట్లు ప్రయాణికులు తెలిపారు.