Share News

స్మార్ట్‌గా.. రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:43 AM

రేషన్‌ కార్డు స్మార్టుగా మారింది. ఏటీఎం సైజ్‌కు తగ్గింది. జేబులోను, పర్సులోను దీనిని పెట్టుకొని వెళ్లొచ్చు. గుర్తింపు కార్డు కింద వాడుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ స్మార్టు కార్డులు తీసుకొచ్చింది.

స్మార్ట్‌గా.. రేషన్‌ కార్డులు

జిల్లాలో రేపటి నుంచి 6,36,196 కార్డుల పంపిణీ

రేషన్‌ కార్డు స్మార్టుగా మారింది. ఏటీఎం సైజ్‌కు తగ్గింది. జేబులోను, పర్సులోను దీనిని పెట్టుకొని వెళ్లొచ్చు. గుర్తింపు కార్డు కింద వాడుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ స్మార్టు కార్డులు తీసుకొచ్చింది. సోమవారం నుంచి వీటి పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాకు కొత్తగా 44,937 రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే దాదాపు 5,91,259 బియ్యం కార్డులున్నాయి. ఈ మొత్తం కలుపుకుని 6,36,196 స్మార్ట్‌ కార్డులను సోమవారం నుంచి పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రోజు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌ కార్డు మాత్రమే ప్రామాణికంగా వుండనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా వివాహమైన దంపతులు, కుటుంబాల నుంచి విడిపోయిన వారికి మళ్లీ కార్డులు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఐదేళ్ల పాటు ఆందోళన చెందారు. వాటి నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కలిగించింది. దీనికోసం ఈ ఏడాది మే 7 నుంచి అన్ని సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో దాదాపు 63,589 మంది దరఖాస్తు చేయగా వివిధ ప్రాతిపదికన పరిశీలించి ఇప్పటి వరకు 44,937 మందిని అర్హులుగా గుర్తించి వారికి మాత్రం ఇప్పుడు కొత్తగా కార్డులు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:43 AM