ఆరు అన్న క్యాంటీన్లు మంజూరు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:50 AM
పేదలకు నాణ్యమైన భోజనంతో కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లు మరో ఆరింటిని జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసింది.
చిత్తూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పేదలకు నాణ్యమైన భోజనంతో కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లు మరో ఆరింటిని జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే చిత్తూరు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరిలో 5 క్యాంటీన్లున్నాయి.కొత్తగా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నాలుగు కేటాయించారు. కుప్పం మండలంలోని మల్లానూరు, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో నాలుగు క్యాంటీన్లను మంజూరు చేశారు. పూతలపట్టు పట్టణంతో పాటు జీడీనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని కార్వేటినగరం మండలంలో మిగిలిన రెండింటిని ఏర్పాటు చేయనున్నారు.పూతలపట్టులో క్యాంటీన్ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే మురళీమోహన్ శంకుస్థాపన చేయగా బుధవారం రామకుప్పంలో ఆర్డీవో, అంతకుముందు గుడుపల్లెలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా.. కొత్తగా మంజూరైన క్యాంటీన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ అధికారులు భూసేకరణ చేసి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి స్థలాన్ని అప్పగించారు. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 లక్షలను మంజూరు చేసింది.