మాజీ డిప్యూటీ సీఎం ఇంటి తలుపుతట్టిన సిట్
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:04 AM
లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఇంటి తలుపు తట్టింది
తిరుపతి/పుత్తూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం తాజాగా అప్పటి ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఇంటి తలుపు తట్టింది. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. విజయవాడకు వచ్చి విచారణకు హాజరు కావాలని ఇదివరకే సిట్ అధికారులు నారాయణస్వామికి నోటీసు ఇచ్చారు. వయోభారం, అనారోగ్యాల కారణంగా విజయవాడ రాలేనని చెప్పడంతో విజయవాడ నుంచే టెలి కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. మళ్లీ విచారణకు హాజరు కావాలని రెండోసారి నోటీసు ఇవ్వగా, నారాయణస్వామి నుంచి స్పందన లేదు. దీంతో సిట్ బృందం శుక్రవారం ఉదయం 11 గంటలకు పుత్తూరు చేరుకుని మాజీ మంత్రి ఇంటి తలుపు తట్టింది. ఇదివరకు తిరుపతి జిల్లా ముఖ్య అధికారిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో నలుగురు డీఎస్పీ స్థాయి అధికారులు నారాయణస్వామిని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలుకుని, అమలు, అవకతకల వరకూ పలు అంశాలపై లోతుగా విచారించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఉపకరిస్తాయన్న ఉద్దేశంతో నారాయణస్వామి ల్యాప్‌టా్‌పను, మొబైల్ ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. దీనికోసం పంచనామాకు వీఆర్వోలను పిలిపించగా, అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీలో వీరిద్దరూ బలమైన నేతలు. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులుగా ముద్ర పడ్డారు. గత ప్రభుత్వంలో బాగా అధికారం కూడా చెలాయించారు. వారిద్దరి అరెస్టు నేపథ్యంలో అదే శాఖకు మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి ఇంటికి సిట్ అధికారులు రావడంతో ఆయన్నూ అరెస్టు చేస్తారనే వైసీపీ వర్గాలు భావించాయి. ఈ పరిణామం ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో గుబులు పుట్టించింది.
తొంగి చూడని వైసీపీ నేతలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో.. కేసు ఏదైనా వైసీపీ నేతల అరెస్టు లేదా విచారణలను ఎదుర్కొనే క్రమంలో ఆ పార్టీ నేతలు మద్దతుగా వెళ్లడం, పోలీసు అధికారులకు అడ్డుపడిన సంఘటనలు అనేకం జరిగాయి. అయితే పుత్తూరులో శుక్రవారం సిట్ అధికారులు నారాయణస్వామిని ప్రశ్నించేందుకు వచ్చిన సందర్భంలో ఓ స్థాయి నాయకులు కూడా ఆయన ఇంటి వైపు తొంగి చూడలేదు. ఆయన నివాసమున్న పుత్తూరు పట్టణం.. నగరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. మాజీ మంత్రి రోజాకు, ఈయనకు ఓ విధంగా చెప్పాలంటే విభేదాలున్నాయి. దాంతో స్థానిక వైసీపీ నేతలు, శ్రేణుల నుంచి ఆయనకు ఎలాంటి మద్దతూ లభించలేదు. ఎలకా్ట్రనిక్ మీడియా ద్వారా తెలుసుకుని జీడీనెల్లూరు నియోజకవర్గం నుంచీ పదుల సంఖ్యలో కార్యకర్తలు మాత్రమే వచ్చారు. జిల్లాలో ఒకరొకరుగా నేతలు జైలుపాలవుతుండడం, కేసుల్లో చిక్కుకుంటుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సడలుతున్న పరిస్థితి కనిపిస్తోంది.