Share News

బక్క చిక్కుతున్న రొయ్య!

ABN , Publish Date - Aug 22 , 2025 | 02:54 AM

రొయ్య బక్క చిక్కుతోంది. సీడ్‌ సరిగా లేకపోవడం, కొందరు హేచరీల వాళ్లు మిక్సింగ్‌ సీడ్‌ వల్ల 60 రోజులకు వంద కౌంట్‌కు రావాల్సిన రొయ్యపిల్లలు.. 80 రోజులైనా 120 కౌంట్‌కు కూడా రావడం లేదు. దీనివల్ల అదనంగా రొయ్యకు మేత, బరువు పెరగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఒకటిలో.. 8వ నెంబరు సీడ్‌ కలపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు అంటున్నారు.

బక్క చిక్కుతున్న రొయ్య!
టైగర్‌ తల్లి రొయ్య

రోజులు గడిచినా ‘కౌంట్‌’రాక నష్టపోతున్న ఆక్వా రైతులు

మిక్సింగ్‌ సీడే కారణమంటూ ఆరోపణలు

రొయ్య బక్క చిక్కుతోంది. సీడ్‌ సరిగా లేకపోవడం, కొందరు హేచరీల వాళ్లు మిక్సింగ్‌ సీడ్‌ వల్ల 60 రోజులకు వంద కౌంట్‌కు రావాల్సిన రొయ్యపిల్లలు.. 80 రోజులైనా 120 కౌంట్‌కు కూడా రావడం లేదు. దీనివల్ల అదనంగా రొయ్యకు మేత, బరువు పెరగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఒకటిలో.. 8వ నెంబరు సీడ్‌ కలపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు అంటున్నారు.

- కోట, ఆంధ్రజ్యోతి

రొయ్యల సాగుతో ఏడాది కిందటి వరకు ధరలు రాక, వ్యాధుల బారినపడి రొయ్యలుచనిపోతూ, ఆక్వా రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ప్రారంభదశలో కొంత ఊరట వచ్చినా.. మిక్సింగ్‌, నాసిరకం సీడ్‌తో నష్టపోతున్నారు. ఒక్కసారిగా తల్లిరొయ్య రేటుపెరిగిపోయిందంటూ హేచరీలు బలహీనంగా ఉండి.. ఆరోగ్యవంతంగా లేని రొయ్యలను మార్కెట్‌లోకి వదులుతుండటంతో ఆక్వా రైతులు విలవిలలాడిపోతున్నారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలో వంద రొయ్యల హేచరీలు ఉండగా, అందులో కోట, వాకాడులలో 18 ఉన్నాయి. ఆయా హేచరీలకు అమెరికాలోని మియామీ, మెక్సికో దేశాల నుంచి తల్లి రొయ్యలు (బ్రోడర్‌) దిగుమతి అవుతాయి. ఆయా దేశాల నుంచి చెన్నైకు చేరుకొనే తల్లి రొయ్యలను నెల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత హేచరీలకు సరఫరా చేస్తారు. ఇదే తల్లిరొయ్య (వెనామి) గతంలో 7 వేలు పలకగా, ప్రస్తుతం 10వేలు (92 డాలర్లు) పలుకుతుంది. హేచరీల యజమానులు ఈ తల్లి రొయ్యలను తీసుకొచ్చి రొయ్యపిల్లలను ఉత్పత్తి చేస్తుంటారు. ఒక తల్లి రొయ్య నుంచి 6 నెలల పాటు 5 సార్లు రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తారు. ఒక్కో దఫా.. ఒక తల్లి రొయ్య 3 లక్షల నుంచి 4 లక్షల వరకు రొయ్యపిల్లలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రకారం.. ఉత్పత్తిఅయిన రొయ్యపిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అయితే హేచరీల యజమానులు పెరిగిన తల్లి రొయ్య ధరలు.. రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 6 నెలల వరకే ఉత్పత్తి చేయాల్సిన తల్లి రొయ్యల నుంచి 8 నెలల వరకు బలహీనమైన, ఆరోగ్యవంతంగాలేని రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. అలా ఉత్పత్తి అయిన రొయ్య పిల్లలను మొదటి నెలలో ఉత్పత్తి అయిన రొయ్యపిల్లలతో మిక్సింగ్‌ చేసి రైతులకు విక్రయాలు చేస్తున్నారు. అంటే.. ఒకటో నెంబరులో 8వ నెంబరు సీడ్‌ (రొయ్య పిల్లలు) కలిపి అమ్ముతున్నారు. దీనివల్ల 60 రోజులకు వంద కౌంట్‌కు రావాల్సిన రొయ్యపిల్లలు.. 80 రోజులైనా 120 కౌంట్‌లకు కూడా రావడం లేదు. దీనివల్ల అదనంగా 20 రోజులపాటు మేత వేసినా.. సరైన కౌంట్‌ రాక ఆక్వా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోనూ కొన్ని హేచరీల నుంచి వచ్చే సీడ్‌ సక్రమంగా లేదని, రొయ్య పిల్లల్లో పెరుగుదల లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుదల లేకుండానే రొయ్య పిల్లలను పట్టేసి నష్టానికి అమ్ముకుంటున్నారు. ఆంధ్రా హేచరీల కన్నా తమిళనాడు, పాండిచ్చేరి, ఒడిశా రాష్ట్రాల్లోని హేచరీలలో ఎక్కువగా రొయ్యల సీడ్‌ మిక్సింగ్‌ జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. దీంతో రొయ్యల గుంటల్లో లక్షల్లో పోసిన సీడ్‌ (రొయ్యపిల్లలు) వేలల్లోకి రావడం, పెరుగుదల లేకపోవడంతో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని ఆక్వారైతులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 02:54 AM