ఆమె..... ఆ ఇంటికి కంటి చూపు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:19 AM
ఆమె ఆ ఇంటికి వెలుగైంది. కుటుంబాన్ని నడుపుతున్న సారథైంది. భర్తతో పాటు అంఽధులైన ఇద్దరు బిడ్డలకూ కంటి చూపు అయింది
నిండ్ర, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆమె ఆ ఇంటికి వెలుగైంది. కుటుంబాన్ని నడుపుతున్న సారథైంది. భర్తతో పాటు అంఽధులైన ఇద్దరు బిడ్డలకూ కంటి చూపు అయింది. బతుకు బండి లాగలేక నిత్యం అవస్థలు పడుతున్న ఆ అభాగ్యురాలు ప్రభుత్వం నుంచి కాసింత సాయాన్ని అభ్యర్థిస్తోంది.నిండ్ర మండలం ఆరూరు పంచాయతీ పాత ఆరూరుకు చెందిన వెంకటరాజుకు అదే గ్రామానికి చెందిన సులోచనతో 40 ఏళ్ల క్రితం పెళ్లయింది. తర్వాత ఈ దంపతులు పొట్టకూటికై ముంబై వలస వెళ్లారు. అక్కడే ఇద్దరు కుమారులు పుట్టారు. పెద్దకుమారుడు కృష్ణ(38)కు పుట్టిన పదేళ్లకే కళ్లు కనిపించడం మానేశాయి. ఆపరేషన్‌లాంటి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చిన్న కుమారుడు గణేష్(36) పుట్టుకతోనే అంధుడు. ముంబైలోనే పదిహేనేళ్లు ఈ దంపతులు బిడ్డలిద్దరితో జీవనం సాగించారు. దురదృష్టవశాత్తూ తర్వాత వెంకటరాజుకు కూడా అంధత్వం వచ్చింది. జన్యుపరంగా వచ్చిన అంధత్వం ఈ కుటుంబాన్ని చీకటిలోకి నెట్టేసింది.ఇంట్లో ముగ్గురూ అంధులవ్వడంతో చేసేది లేక వీరిని తీసుకుని సులోచన స్వస్థలానికి చేరుకుంది. తానే కుటుంబ పోషణ బాధ్యతను భుజాన వేసుకుంది. ఇంటి దగ్గరే చిన్నపాటి టిఫిన్ అంగడి నడుపుతోంది. ఈ క్రమంలో దివ్యాంగుల పెన్షన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయించింది. పుట్టుకతో అంధుడైన చిన్నకుమారుడు గణే్‌షకు మాత్రమే 2023 చివరి నుంచి దివ్యాంగ పెన్షన్ మంజూరైంది. ఇతనికి నెలకు రూ.6వేలు వస్తోంది. వెంకటరాజు,కృష్ణ అంధులైనా వారికి పెన్షన్ మంజూరు కాలేదు. ఒకే రేషన్‌కార్డులో వీరి పేర్లుండడంతో నిబంధనల మేరకు ఒక్కరికే పెన్షను వస్తోంది. ఈ దయనీయ కుటుంబానికి నిబంధనలే శాపంగా మారాయి. వాస్తవానికి ముగ్గురూ ఎవరి సహాయం లేకుండా అడుగు కదపలేని పరిస్థితి. తమ కుటుంబ దుర్భర జీవన స్థితి గుర్తించి భర్తకు, పెద్ద కుమారుడు కృష్ణలకూ దివ్యాంగ పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని సులోచన అధికారులను వేడుకుంటోంది.