పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:39 AM
తుఫాను ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాన్ షెల్టర్లతో పాటు అవసరమైతే కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రభుత్వ భవనాలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి పీఎస్ గిరీషా సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాన్ షెల్టర్లతో పాటు అవసరమైతే కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రభుత్వ భవనాలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి పీఎస్ గిరీషా సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలకు కూలేస్థితిలో వున్న పూరిళ్ళలో ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు మూడురోజులకు సరిపడే నిత్యావసర సరుకులను సిద్ధం చేసుకోవాలన్నారు. అక్కడే ఆహారాన్ని వండి వారికి భోజనాలు అందించాలని, చిన్నపిల్లలు ఉంటే పాలు సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల సిబ్బంది విధులతో పాటు పునరావాస కేంద్రాల విధుల్లో పాల్గొనాలని ఆదేశించారు.హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా సమీప ఆస్పత్రుల్లో చేర్పించడంతో పాటు వారి సహాయకులకు వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా పైపులైన్లను తనిఖీచేయాలని, క్లోరినేషన్ చేసిన మంచినీటినే ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల వద్ద జనరేటర్‌ను సిద్ధంచేయాలన్నారు.
పూర్తిగా నిండిన 1305 చెరువులు
జిల్లావ్యాప్తంగా 4122 చెరువులుండగా, వాటిలో వందశాతం మేర 1305 చెరువులు నిండగా, 75శాతం 723 చెరువులు, 50శాతం మేర 1093 చెరువులు నిండగా, మిగిలిన చెరువుల్లో 25శాతం నీరు చేరాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు.చెరువులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల నీటి ప్రవాహాన్ని అంచనా వేసుకుని ఇరిగేషన్ అధికారులు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. గండి పడే అవకాశం ఉన్న, ప్రమాదకరంగా మారే ప్రదేశాల్లో ఇసుక వంటి మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు.
మండలకేంద్రాల్లోనే అధికారులు, సిబ్బంది ఉండాలి
తుఫాన్ ప్రభావంతో పంటలకు, ఆస్తులకు నష్టం జరిగితే ఆ వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు మండల ప్రత్యేక అధికారులు, సిబ్బంది మండలకేంద్రాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.ఇరిగేషన్ ఎస్‌ఈ రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రసన్నకుమార్, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.