సేవతోనే ఆత్మ సంతృప్తి
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:44 AM
దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగబద్దమైన ఉప రాష్ట్రపతి పదవి కన్నా, స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా పేదలకు అందించే సేవలే తనకు ఆత్మ సంతృప్తినిస్తున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.
పేదలకు గౌరీశంకర్ చేస్తున్న సేవలు ఆదర్శనీయం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెళ్లకూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగబద్దమైన ఉప రాష్ట్రపతి పదవి కన్నా, స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా పేదలకు అందించే సేవలే తనకు ఆత్మ సంతృప్తినిస్తున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. పెళ్లకూరులో సోమవారం చాగణం లలితమ్మ-భాస్కర్‌రావు మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ గౌరీశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ‘పెళ్లకూరు నుంచి గౌరీశంకర్ ఇతర ప్రదేశాలకు వెళ్లి వృద్ధిలోకి వచ్చారు. తన తల్లిదండ్రులు చాగణం లలితమ్మ-భాస్కర్‌రావు పేరిట ట్రస్టు నెలకొల్పి, తన సంపాదనలో కొంతభాగాన్ని పేదలకు ఖర్చు చేయడం స్ఫూర్తిదాయకం. గ్రామాల్లో తాగునీరు, ఉచిత వైద్యశిబిరాలు, మొక్కల పంపిణీ, పెంపకం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, మొబైల్ వ్యాను ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్ సెంటర్, కుట్టుమిషన్, డ్రైవింగ్ స్కూల్ తదితర కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించం అభినందనీయమన్నారు. ఇంటర్ నుంచి బీటెక్ వరకు చదివే 58మంది పేద విద్యార్థులకు రూ. 25 లక్షలు, మరో 20 మందికి రూ.10 వేలను ఉపకార వేతనాలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి వెంకయ్యనాయుడు అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న లలితమ్మ డీ ఆడిక్షన్ సెంటర్, సేవాసదనం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లలితమ్మ డయోగ్నోస్టిక్ సెంటర్, వ్యాయామశాలతో పాటు ఉద్యానవనాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. కాగా, మండలంలోని చెన్నప్ననాయుడుపేట, శిరసనంబేడు రాజుపాలెం కానూరు, రోసనూరు తదితర గ్రామాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడే వారినీ ట్రస్ట్ ద్వారా ఆదుకోవాలని మాజీఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కోరగా, చాగణం గౌరీశంకర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రంగినేని కృష్ణయ్య, శ్యామ్‌బన్సల్, చంద్రశేఖర్‌రెడ్డి, చాగణం వరలక్ష్మి, శ్రీవిన్య, కావ్య, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.