కపిలేశ్వరాలయంలో భద్రత కట్టుదిట్టం
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:46 AM
కార్తీక మాసం రెండో సోమవారం. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ఆలయ మార్గంలో ఆంక్షలు విధించారు.
కార్తీక మాసం రెండో సోమవారం. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ఆలయ మార్గంలో ఆంక్షలు విధించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా అన్నారావు సర్కిల్ మీదుగా కపిలేశ్వరాలయానికి వెళ్లే కేటీరోడ్డు రెండు వైపులా బారికేడ్లు పెట్టి వాహన రాకపోకలను హరేరామ హరేకృష్ణ మార్గం వైపు మళ్లించారు. ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించలేదు. ఆలయంలోకి నంది సర్కిల్ నుంచే క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి సన్నిధి సమీపంలోని ఉద్యానవనం(జంగిల్ బుక్)లో కార్తీక దీపాలు వెలిగించడానికి వెళ్లి, వచ్చేలా క్యూలైన్‌ను సడలించారు. జలపాతం, పుష్కరిణి వైపు వెళ్లకుండా గేట్లను అమర్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు రాగి, వేప చెట్టు వద్ద పూజలు చేయడం అనవాయితీ. ఈసారి ఆ అవకాశం లేకుండా క్యూలైన్ పెట్టారు. కార్తీక దీపాలు వెలిగించాక దర్శనానికి వెళ్లడానికి భక్తులు అవస్థలు పడ్డారు. కొందరు దర్శనం చేసుకోకుండానే దీపాలు వెలిగించి తిరుగుముఖం పట్టారు. ఇక, కపిలేశ్వరాలయం దీపాల వెలుగులతో నిండిపోయింది. జంగిల్ బుక్‌లో దీపాలు వెలిగించి పూజలు చేశారు. సాయంత్రం దీపాలు వెలిగించడానికి వచ్చే భక్తుల సంఖ్య కొంత పెరిగింది. ఇక, కపిలతీర్థంలోకి అనుమతించలేదు. జిల్లాలోని అన్ని శివాలయాలు, జలపాతాల వద్ద కూడా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
- తిరుపతి(కల్చరల్), ఆంధ్రజ్యోతి
లక్ష దీపోత్సవం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధమైన వైష్ణవ పుష్కరణిలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. పుష్కరణి చుట్టూ నేతిదీపాలను వెలిగించారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి