Share News

స్వామి సేవకు రెండోసారి

ABN , Publish Date - Sep 11 , 2025 | 01:39 AM

శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు రెండోసారి టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవోగా, బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎక్స్‌ ఆఫిషియోగా బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

స్వామి సేవకు రెండోసారి
కాలినడకన తిరుమలకు వస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌

టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు రెండోసారి టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవోగా, బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎక్స్‌ ఆఫిషియోగా బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రెండోసారి ఈవోగా రావడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2017 మే నుంచి 2020 అక్టోబరు వరకు మూడేళ్ల నాలుగు నెలలు సేవలు అందించానని చెప్పారు. 1994 నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నానని చెప్పారు. ఈవోగా కాకుండా సామాన్యు భక్తుడిగా క్యూలైన్‌లో నిలబడి స్వామిని దర్శించుకున్న సందర్భాలున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లోని గరుడసేవను కూడా సామాన్యుడిగా దర్శించానని, తనకు సామాన్య భక్తుల ఇబ్బందులు తెలుసన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీపై దృష్టి పెడతామన్నారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారన్నారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచనలు చేస్తున్నామన్నారు. భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామన్నారు.

కాలినడక, తలనీలాల సమర్పణ

ఈవోగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉదయం 5.05 గంటలకు అలిపిరి మార్గంలో కాలినడకను ప్రారంభించి 8 గంటలకు చేరుకున్నారు. మార్గంమధ్యలో కొందరి భక్తులతో మాట్లాడారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు తెలుసుకోవడంతో పాటు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఎలాంటి విషయాల్లో చర్యలు తీసుకోవాలనే ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. అనంతరం తిరుమలలో తలనీలాలు సమర్పించి ఆలయంలోకి వెళ్లారు.

Updated Date - Sep 11 , 2025 | 01:39 AM