రైతు భూమికి రాజముద్ర
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:00 AM
ఇలా నాటి సీఎం జగన్ ఫొటోల పిచ్చిపై రైతులు ఆగ్రహం.. ఆందోళన వ్యక్తంచేశారు
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): భూమి రైతులది. పాస్‌పుస్తకాలపై బొమ్మ మాజీ సీఎం జగన్‌ది. సరిహద్దు రాళ్లపైనే ఆయన బొమ్మనే చెక్కించుకున్నారు. ఇలా నాటి సీఎం జగన్ ఫొటోల పిచ్చిపై రైతులు ఆగ్రహం.. ఆందోళన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలు అందిస్తామని నాడు చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీ మేరకు రాజముద్ర, భూయజమాని చిత్రాలతో 52,579 కొత్త పాస్‌పుస్తకాలు జిల్లాకు చేరాయి. వందేళ్ల తర్వాత భూములు రీసర్వే చేస్తున్నట్లు నాడు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. జిల్లాలో 1,048 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 320 గ్రామాల్లో రీసర్వే చేపట్టింది. రైతులకు కనీస సమాచారం లేకుండానే హద్దులు పాతారు. ఆ సర్వే కూడా తప్పుల తడకగా సాగింది. ఇది రైతుల మధ్య వివాదాలకు దారి తీసింది. పల్లెల్లో భూ పంచాయితీలు పెరిగాయి. ఇవేవీ పట్టించుకోకుండానే నాటి ప్రభుత్వం హడావిడిగా 52,579 మంది రైతులకు భూహక్కు పత్రాలను జారీ చేసింది. జగన్ ఫొటోతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు రీసర్వే చేసిన ప్రాంతాల్లో హద్దురాళ్లపైనా జగన్ బొమ్మను చెక్కడంపైనా రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల హామీ మేరకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తప్పులను సరిచేసింది. రాజముద్ర, భూయజమాని ఫొటో, పూర్తి వివరాలతో కొత్తపట్టాదారు పుస్తకాలను తీసుకొచ్చింది. రీ సర్వే జరిగిన 320 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 52,579 పాసుపుస్తకాలు తిరుపతికి చేరాయి. వీటిలో చిన్నచిన్న తప్పిదాలు, మృతి చెందినవారివి, నోషనల్ ఖాతాలు ఉన్న 24,636 పాసుపుస్తకాలను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన 27,942 పట్టాదారు పాసుపుస్తకాలను కలెక్టరేట్ నుంచి ఆయా తహసీల్దారు కార్యాలయాలకు పంపించారు. త్వరలో భూయజమానులకు వీటిని పంపిణీ చేస్తామని డీఆర్వో నరసింహులు తెలిపారు. మిగిలిని వారికి త్వరలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందనున్నాయి.