Share News

శాస్ర్తోక్తంగా ధ్వజావరోహణం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:13 AM

కాణిపాక వరసిద్ధుని ఆలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి

శాస్ర్తోక్తంగా ధ్వజావరోహణం
పుష్కరిణిలో త్రిశూలానికి క్షీరాభిషేకం

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుని ఆలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.ఆలయంలోని ధ్వజస్తంభంపై వున్న మూషిక ధ్వజ పటాన్ని అర్చకులు, వేదపండితులు మేళ,తాళాలు,వేద మంత్రోచ్ఛారణ నడుమ కిందకు దించడంతో ధ్వజావరోహణం పూర్తయింది.అంతకుముందు పుష్కరిణి వద్ద త్రిశూల స్నానాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారికి రక్షగా యాగశాలలో త్రిశూలాన్ని ఉంచుతారు.రోజూ ఉదయం పుర వీధులలో టింగ్‌టింగ్‌ పిళ్లారప్పగా(సప్పరం) త్రిశూలాన్ని ఊరేగిస్తారు.త్రిశూలస్నానం తరువాత యాగశాలలో మంత్రబద్ధంగా 108 మట్టికుండల్లో ఉంచిన నవ ధాన్యాలను తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.అనంతరం త్రిశూలాన్ని, మొలకెత్తిన నవధాన్యాలను పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.కాగా బ్రహ్మోత్సవాల విధుల్లో అలసిసొలసిన ఆలయ అధికారులు, సిబ్బందికి ఆట విడుపుగా వసంతోత్సవాన్ని నిర్వహించారు.ఈవో కిషోర్‌ సహా అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకుని సంతోషాన్ని ప్రకటించారు.బ్రహ్మోత్సవాల ప్రారంభ సందర్భంగా ఈవో కిషోర్‌కు,ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌కు కట్టిన కంకణాలను శుక్రవారం అర్చకులు తొలగించారు.అనంతరం ఈవోను ఆలయ మర్యాదలతో కార్యాలయం వద్ద దిగబెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్యోత్సవం అంటారు.అలాగే వరసిద్ధి వినాయకస్వామికి వడాయత్తు ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయదారుగా కాకర్లవారిపల్లెకు చెందిన కీర్తిశేషులు గాలిఉమాపతినాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె సుజాత వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించాక మూలవిరాట్‌కు వడమాలను(వడలతో తయారు చేసిన మాల) ధరింపజేశారు. అలాగే స్వామికి పెసరపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు.అనంతరం స్వామికి ఏకాంత సేవను నిర్వహించారు.కీర్తిశేషులు కె.సోమశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలకు ధూప, దీప నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. అనంతరం తీసుకెళ్లి అలంకార మండపంలో ఉంచి అధికారులు, అర్చకులు, సిబ్బంది వెనుదిరిగారు.ఈ కార్యక్రమాల్లో ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు పాల్గొన్నారు.

నేటినుంచి ప్రత్యేక ఉత్సవాలు

కాణిపాకంలో శనివారం నుంచి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 6వ తేదీన అధికారనంది వాహనం, 7న రావణబ్రహ్మ వాహనం(చంద్ర గహణం కారణంగా ఉత్సవాలను ఉదయం నిర్వహిస్తారు.), 8న యాళి వాహనం, 9న సూర్యప్రభ,10న చంద్రప్రభ వాహన సేవలు, 11న కల్పవృక్ష వాహనసేవ, 12న విమానోత్సవం, 13న పుష్పపల్లకి సేవ, 14న కామధేను వాహనం,15న పూలంగి సేవ, 16న తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:13 AM